హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు కొత్త ఎత్తులు పన్నుతున్నారు. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే ప్రజల ఓట్లను కొనడానికి కొత్త తరహా విధానానికి తెరలేపారు. నేరుగా ఓటరు ఇంటికే వెళ్లి, వారి బ్యాంకు ఖాతా నెంబరు తీసుకుని, డైరెక్టుగా అందులోకే డబ్బులు పంపేస్తున్నారట.


మేయర్ పీఠం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ వంటి చోట మేయర్ పీఠం దక్కడం అంటే ఆ కిక్కే వేరు. అందుకే బరిలో ఉన్న ప్రతి పార్టీ అభ్యర్థి తన డివిజన్‌లో గెలవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. ప్రజల ఓట్లు దక్కించుకోవడానికి ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నో జిమ్మిక్కులు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందులో భాగంగానే ఓటుకు నోటు పంపిణీ చేయడానికి కూడా వెనుకాడరు. ఒకప్పుడు డబ్బులను చేతికందించేవారు. ఆ తరువాత టెక్నాలజీ రావడంతో ఆన్‌లైన్‌లో పంపించడం మొదలెట్టారు. దీనికోసం ఫోన్‌పే, గూగుల్ పే అప్లికేషన్లను వినియోగించేవారు. అయితే వీటి వల్ల ట్రాన్సాక్షన్‌లు బయటపడేవి. దాంతో ఈ సారి అభ్యర్థులు నయా పంథా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఓటర్ల బ్యాంకు అకౌంట్‌కే డబ్బులు పంపించేలా ఏర్పాటు చేస్తున్నారట. దీనికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ బయటకు రావడంతో ప్రస్తుతం కలకలం రేగింది. బయట పడిన ఆడియో క్లిప్ ప్రకారం.. జగద్గిరిగుట్టలో ఈ సంఘటన జరిగింది. ఓ ఓటర్ బ్యాంకు ఖాతాకు ఓ పార్టీకి చెందిన మేయర్ అభ్యర్థి దాదాపు రూ.5 వేల నగదును పంపించాడట. ఉన్నట్లుండి తన ఖాతాకు రూ.5 వేలు రావడంతో ఖాతాదారుడికి ఏమీ అర్థం కాలేదు. ఇంతలోనే అక్కడి బూత్ కమిటీ ఇన్‌చార్జి అతడికి ఫోన్ చేసి.. తామే నగదు వేశామని, ఓటు తమకే వేయాలని అభ్యర్థించాడట.

గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో ఇటీవల కొన్ని ప్రత్యక్షంగా నగదు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీల వాళ్లతో వివాదాలు రేగాయి. దీంతో అభ్యర్థులు ఏ గొడవా లేకుండా ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆదివారంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఈ మధ్యలో ఉన్న సోమవారం నాడు అభ్యర్థుల నుంచి ఇంకెన్ని కొత్త ప్లాన్‌లు చూడాల్సి వస్తుందో ఏమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: