రొహింగ్యాలు ప్రధానంగా మయన్మార్ దేశంలోని రఖైన్ రాష్ట్రానికి చెందిన వారు. వీళ్లను ఆ దేశం తమ పౌరులుగా గుర్తించటం లేదు. పరిస్థితులు మరింత ముదిరి 2012లో రోహింగ్యాలపై మిలిటరీ చర్యలకు దిగింది మయన్మార్. దీనితో ఇల్లూ, వాకిలి వదిలి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు రొహింగ్యాలు. వీలైతే భూమార్గం, లేదంటే సముద్రబాట పట్టారు. కొంతమంది బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టారు. కొంతమంది మలేషియా, ఇండోనేషియా వైపు వెళ్లి స్థిరపడ్డారు. అయితే బంగ్లాదేశ్‌ మీదుగా కొంతమంది భారతదేశంలోకి కూడా ప్రవేశించారు. బంగ్లాదేశ్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించటం, అటు నుంచి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశించి స్థిరపడ్డారు. రొహింగ్యాలు ముస్లింలు కావడంతో ఆవర్గం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీరు నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా అసోం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, తెలంగాణ, కేరళల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు.

మయన్మార్‌ నుంచి వచ్చిన రొహింగ్యా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి పాతబస్తీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసింది. వీరికి ఐక్యరాజ్యసమితి శరణార్థి గుర్తింపు కార్డులను కూడా ఇచ్చింది. ఈ కార్డుపై వారి వివరాలతో పాటు గుర్తింపు కార్డు జారీ చేసిన తేదీ, ఎంత వరకు అనుమతి ఉంది అనే వరాలు పొందు పరిచి ఉంటాయి. నిర్ధారిత తేదీ తర్వాత కూడా ఇక్కడే కొనసాగితే అప్పుడు అక్రమంగా నివసిస్తున్నట్లు లెక్క. అయితే ముగింపు తేదీ కంటే ముందే రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకుని తిరిగి మరి కొంతకాలానికి అనుమతి సంపాదిస్తుంటారు. పాతబస్తీలోని బాలాపూర్‌, రాయల్‌ కాలనీల్లో వీళ్లు ఎక్కువగా ఉన్నారు. క్యాంపుల్లో కొంతమంది ఉంటే... చాలా అక్కడ కాకుండా పాతబస్తీలోని ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. వీరంతా రోజు కూలీలు చేసుకునే వారే. హైదరాబాద్‌లో అధికారికంగా 5నుంచి 6 వేలమంది రొహింగ్యాలు ఉన్నారని అంచనా.


రొహింగ్యాల వల్ల తమకు ఇబ్బంది ఏమీ లేదని, ఎన్నికల కోసమే పార్టీలు రొహింగ్యాల అంశాన్ని వాడుకుంటున్నాయని అంటున్నారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: