హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాయి. సాధారణ ప్రజలతో పాటు అనేకమంది ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎంఎల్‌సీ కవిత ఓటు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కవిత రెండు ఓట్లు వేశారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, వెంటనే ఆమె ఓటు రద్దు చేయాలని అంతేకాకుండా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత నిజంగానే రెండు చోట్ల ఓటు వేశారంటూ ఆర్వో ప్రకటించడం సంచలనంగా మారింది.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్, పోతంగల్‌ నియోజకవర్గంలో ఓటు ఉంది. అయితే ఆమె అక్కడి ఓటును వదులుకోకుండానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ఓటు వేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అని, తక్షణమే ఆమె ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కోరారు. ఈసీ పార్థసారథికి ఈ మెయిల్ ద్వారా తన ఫిర్యాదును పంపారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పొతంగల్ పోలింగ్ బూత్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఓటు చేశారని, అలాంటప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ ఎలా ఓటు వేస్తారంటూ ప్రశ్నించారు. అందుకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె తన ఫిర్యాదుకు జతపరిచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు వేయడంపై బోధన్ ఆర్వో రాజేశ్వర్ స్పందించారు. కవిత రెండు చోట్ల ఓటు వేసిన మాట వాస్తవమేనని, అయితే ఆమె జూబ్లీ‌హిల్స్‌లో తన ఓటు వినియోగించుకోవడం కోసం పోతంగల్‌లో ఉన్న ఓటును తొలగించుకున్నారని, ఆమెతో పాటు ఆమె భర్త ఓటును కూడా అక్కడి నుంచి హైదరాబాద్‌కు బదలాయించుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోగలిగారని క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: