హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు వచ్చింది. దుబ్బాకలో ఓడిపోయి ఆలోచనలో పడిన అధికార టీఆర్‌ఎస్‌కు.. గ్రేటర్ ఫలితాలు కూడా నిరాశనే మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో 55 డివిజన్లలో గెలిచి టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ గత గ్రేటర్ ఎన్నికలతో పోల్చుకుంటే గులాబీ పార్టీ గెలుపొందిన స్థానాలు గణనీయంగా తగ్గాయి. గతంలో గులాబీ పార్టీ 99 స్థానాల్లో విజయఢంకా మోగించింది.

అంటే గతంతో పోల్చుకుంటే టీఆర్ఎస్ సగానికి సగం సీట్లు కోల్పోయింది. ఈ క్రమంలో సీతాఫల్‌మండి డివిజన్‌ మధురా నగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బౌద్ధనగర్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి మేకల కీర్తి ఇంటి ముందు టీఆర్‌ఎస్‌ నాయకులు టపాసులు కాల్చారు. ఈ కారణంగానే ఇక్కడ కొద్దిసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బౌద్ధనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంది శైలజ సమీప బీజేపీ అభ్యర్థి మేకల కీర్తిపై 815 ఓట్ల మోజార్టీతో గెలుపొందారు.

దీంతో కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు, యువకులు టపాసులు, మందు గుండును తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థి కీర్తి ఇంటి ముందు అవి పేల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో కొంత ఆందోళన నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న చిలకలగూడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాల గంగిరెడ్డి బందో బస్తుతో వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. టీఆర్‌ఎస్‌ యువకులను అక్కడ నుంచి వెళ్లగొట్టారు. ఈ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.

గెలుపు ఓటములు సహజమని, తమ ఇంటి ముందు టపాసులు కాల్చి హంగామా చేయటం మంచి పద్ధతి కాదని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత సారంగ పాణి ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచనలు చేశారు. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: