కరోనా కష్టకాలంలో ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా విద్యార్థులంతా పాసైపోయారు. పరీక్షలు లేకుండానే ఒడ్డున పడ్డారు. మార్కులు, ర్యాంకులు లేకపోవడంతో ఒకరకంగా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు నష్టపోయారని అనుకున్నారంతా. కానీ అసలు సమస్యలు ఇప్పుడిప్పుడే అవగాహనలోకి వస్తున్నాయి. కరోనా కాలంలో పదో తరగతి పరీక్షలు రద్దయి, మార్కులు, గ్రేడ్ లు ఇవ్వకపోవడంతో.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు ఎక్కువ సీట్లు వచ్చాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మెరిట్ స్టూడెంట్స్ కు ఇంజినీరింగ్‌ విద్యను అందించేందుకు ప్రారంభించిన ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాల్లో ఈ ఏడాది ప్రైవేటు విద్యార్థులదే పైచేయి అయింది. ప్రతి ఏటా పదో తరగతి మార్కుల ఆధారంగా నిర్వహించే ప్రవేశాలకు బదులుగా ఈసారి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడలేక సీట్లు కోల్పోయారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు 34శాతానికిపైగా సీట్లను నష్టపోగా.. ప్రైవేటు విద్యార్థులు 59శాతం సీట్లను ఎక్కువగా సంపాదించారు.

రాష్ట్రంలో ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలో నాలుగు ట్రిపుల్ ‌ఐటీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,407 సీట్లు ఉన్నాయి. ప్రతి ఏడాదీ వీటిలో 75శాతం నుంచి 80శాతం వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే సీట్లు దక్కుతాయి. మిగతా 20శాతం ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు దక్కించుకుంటారు. కేవలం పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ప్రవేశాలుంటాయి. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు కాస్త ప్రయారిటీ ఎక్కువ. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,823సీట్లు (41.4శాతం) రాగా.. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 2,584 (58.6)శాతం సీట్లు పొందారు. దీంతో సహజంగానే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు నష్టపోయినట్టు అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: