ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది.. మార్చి లో పుర పాలక ఎన్నికలు రానున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమీషన్ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీ లో శనివారం రాత్రి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ అధికారుల తో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.


ఇదే స్ఫూర్తి తో మున్సిపల్‌ ఎన్నికల ను నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరు కు ఓటింగ్‌ స్లిప్‌ చేరాలని చెప్పారు.ఈ ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచడంతో పాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ లో హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేసి ఓటరుకు తమ ఓటు, పోలింగ్‌స్టేషన్‌ వివరాలు అందించాలని ఆదేశించారు. పార్టీ ప్రాతిపదికన మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నందున పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. కోవిడ్‌ నేపథ్యం లో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి ఇస్తున్నామన్నారు. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


ఎవరైనా మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఒత్తిడికి, ప్రలోభాలకు లోనై నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభ్యర్థిస్తే సానుకూలంగా స్పందిస్తామన్నారు. మార్చి 1న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధనలను.. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు  అందరితో ఈ నిబంధనల గురించి చెప్పాలని కలెక్టర్లతో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: