సరిహద్దులోనే కాదు.. దేశంలోపలా ఇబ్బందులు పెట్టే కుట్రలకు దిగుతోంది చైనా. లేటెస్ట్ గా అమెరికా సంస్థ వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి. గత ఏడాది ముంబయిలో పవర్‌ కట్‌ వెనుక చైనా హస్తం ఉందని తేలింది.

భారత్‌ ఆర్థిక రాజధాని ముంబయిలో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వరుసగా ఒక్కో ప్రాంతంలో పవర్‌ కట్‌ మొదలయింది. సమస్యేంటో విద్యుత్‌ సిబ్బందికి అర్థం కాలేదు. నగరానికి విద్యుత్‌ సరఫరా చేసే గ్రిడ్‌లో లోపం వల్ల పవర్ కట్‌ అయిందని అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పలు రైల్‌ సర్వీసులు రద్దయ్యాయి. ఆసుపత్రుల్లో రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు.  

ఆ రోజు ముంబయిలో కరెంట్‌ రావటానికి చాలా సమయం పట్టింది. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలకు పైగా కరెంట్‌ లేదు. ఈ పవర్‌ కట్‌ మనదగ్గర సాంకేతిక సమస్యతో వచ్చింది కాదని, దాని వెనుక కుట్రలున్నాయని ఇప్పుడు తేలింది. అమెరికాలోని రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అనే సంస్థ ఈ సంచలనాన్ని వెల్లడించింది. సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్‌ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్‌ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా ముంబయి పవర్‌కట్‌ తో హెచ్చరించిందని ఆ సంస్థ తెలిపింది.

ఈ రిపోర్ట్‌ తో  చైనా కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. భారత విద్యుత్తు సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ లు, లోడ్‌ డిస్పాచ్‌‌ సెంటర్లను చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్‌ గ్రూప్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని తేలింది. ఇది ముంబయిలో భారీ పవర్‌కట్‌కు దారితీసిందని ఈ అధ్యయనం చెప్తోంది.

విద్యుత్తు, టెలికాం రంగంలో భారత్‌ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా చైనా పరికరాలనే వినియోగిస్తున్నారు. భారత్‌లో వినియోగించే రూటర్లు అత్యధికం అక్కడి నుంచే వస్తున్నాయి. గతంలో భారత విద్యుత్‌ రంగంలో చైనా పరికరాలను పూర్తిగా నిషేధించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే, సరిహద్దు వివాదానికి తెరదించేలా ఈ మధ్య భారత్‌, చైనా కీలక ఒప్పందం చేసుకున్నాయి. అందులో భాగంగానే పాంగాంగ్‌ సరస్సు వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: