పురపాలక సంఘాల ఎన్నికలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లు, నేరచరితుల కదలికలపై నిఘా ఉంచారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రకాశం జిల్లాలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వీటి నిర్వహణలో పోలీసు శాఖ విజయవంతమైంది. ప్రస్తుతం పురపోరుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఎన్నికల సమయాల్లో నమోదైన కేసులు, నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. గతంలో జరిగిన గొడవలు.. ప్రస్తుతం నెలకొన్న వివాదాలపై ఆ రా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న రౌడీషీటర్లతోపాటు, మండలాల్లో ఉన్న నేరచరితుల కదలికలపై కూడా నిఘా ఉంచారు. రాజకీయ పార్టీల  నాయకులుగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా వివాదాలకు పాల్పడేవారి  జాబితాను తయారు చేసి వారిని బైండోవర్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల రౌడీ షీటర్లను స్టేషన్లకు పిలిపించి గొడవల్లో తలదూర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపుతున్నారు.

ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించి ప్రత్యేక రూట్ మ్యాప్ తయారుచేస్తున్నారు. అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉన్న చోట్ల త్వరితగతిన ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ప్రతి మున్సిపాలిటీలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అదనపు ఎస్పీలకు అప్పగించారు. నగర పంచాయతీ ఎన్నికల పర్యవేక్షన బాధ్యత డీఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: