ఏసీబీ దాడులంటే కేవలం అధికారులను మాత్రమే టార్గెట్ చేస్తారని తెలుసు. అయితే ఇటీవల తెలంగాణలో ఏసీబీ అధికారులు ప్రజా ప్రతినిధుల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను ఇలా దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. లంచం తీసుకుంటున్న సందర్భంలో.. సర్పంచులు, ఉప సర్పంచులేకాదు...సర్పంచుల భర్తలను కూడా అరెస్ట్‌ చేస్తోంది ఏసీబీ. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక సర్పంచి, మరో సర్పంచి భర్తను లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం విశేషం.

సర్పంచ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రామ, తాలూకా, పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు.. వీరిలో ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని సమాచారం లభిస్తే.. ఏసీబీ అధికారులు సాక్ష్యాధారాలతో పట్టుకోవచ్చు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అరెస్ట్‌ చేసేందుకు ముందుగా శాసనసభ సభాపతి లేదా మండలి ఛైర్మన్‌ అనుమతి తీసుకోవాలి. అయితే ఇప్పటి వరకూ కేవలం ఏసీబీ అధికారులు ప్రభుత్వ సిబ్బందినే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రజా ప్రతినిధులను వదిలేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై కూడా ఏసీబీ దృష్టిసారించడంతో కలకలం రేగింది. సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు షాకవుతున్నారు. తాము కూడా ప్రజా ప్రతినిధులమే కాబట్టి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కు ఉన్న వెసులుబాటు తమకు కూడా కల్పించాలంటున్నారు.

హైదరాబాద్ పరిసరాల్లోనే ఎక్కువ..
హైదరాబాద్‌ శివార్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో కొద్దినెలల నుంచి వెంచర్లు మొదలయ్యాయి. రియల్ ఎస్టేట్‌ వ్యాపారం తిరిగి పుంజుకోవడంతో వెంచర్లు వేస్తున్న వ్యక్తులు, సంస్థలు అనుమతుల కోసం ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాలకు వెళ్తున్నారు. అక్కడే ఉంటున్న కొందరు సర్పంచులు తమకు లంచం ఇస్తేనే వెంచర్లు వేసేందుకు, సరిహద్దు కంచెలు నిర్మించేందుకు అనుమతులిస్తామంటున్నారు. నో అబ్జక్షన్ సర్టిఫికెట్లకోసం లక్షలు చేతులు మారుతున్నాయి. ఈ క్రమంలో ఈ లావాదేవీలపై ఏసీబీ దృష్టిసారించింది. జనవరి నెలలో మహేశ్వరం మండలం మాన్‌ సాన్ ‌పల్లి గ్రామ సర్పంచి భర్త కంది రమేష్‌, ఉప సర్పంచ్‌ నరసింహ యాదవ్ ‌లు ఓ రియల్‌ వెంచర్‌ సంస్థ నుంచి రూ.7.5లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇదే వ్యవహారంలో ఎంపీడీవో కూడా ఏసీబీకి చిక్కారు. ఇలా అవినీతికి పాల్పడిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు ఉండటంతో.. వారు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: