మినీ మునిసి‘పోల్స్‌పై టీఆర్ ఎస్ పార్టీ గురి పెట్టింది. త్వ‌ర‌లోనే గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న విష‌యం తెలిసిందే. ఈమేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు స‌న్న‌ద్ధ‌త‌ను గ‌తంలోనే తెలియ‌జేయ‌డంతో ప్ర‌క్రియ ఏర్పాట్ల‌ను క‌మిష‌న్ వేగిరం చేసింది. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పోరేష‌న్ల‌తో పాటు జీహెచ్‌ఎంసీలోని 18వ డివిజన్‌, మరికొన్ని ఖాళీలకు కూడా ఎన్నికలు జరపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగిరం చేశాయి. వార్డులను ఇప్పటికే ఖరారు చేశారు. వారం రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల ఖరారు, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు.


ఎన్నికలకు ఈ నెల 17న నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారని, అంతకు ఒకట్రెండు రోజుల ముందే.... ఎస్‌ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ నెల 30న పోలింగ్‌ జరిపి మే 2 లేదా ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉండ‌గా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కేటీఆర్ చారిత్ర‌క న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టడంతో ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ నెల 12న మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఖ‌మ్మంలో మూడు ద‌ఫాలుగా కేటీఆర్ ప‌ర్య‌టించి అక్క‌డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.


తాజాగా వ‌రంగ‌ల్‌పై పార్టీ అధిష్ఠానం గురిపెట్టింది. కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. కేటీఆర్‌రాక సందర్భంగా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి శనివారం ఆయా ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.  కేటీఆర్‌ 1700 కోట్ల విలువగల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంచుడతారని పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్నందున ఆయ‌న ఎక్క‌డ ప్ర‌సంగాల‌కు వెళ్ల‌కుండా సాధ్య‌మైన‌న్నీ ఎక్కువ ప్రాంతాల్లో ప‌ర్య‌టింప‌జేసేలా స్థానిక నాయ‌కులు రూట్ మ్యాప్ రూపొందించారు. దీనివ‌ల్ల ప‌ట్ట‌ణంలో పార్టీ శ్రేణులు ఉత్తేజిత‌మ‌వుతార‌నే ఎత్తుగ‌డే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: