బెజవాడ రైల్వేస్టేషన్ అమ్మ‌కానికి రంగం సిద్ధమైంది. కేంద్రం రూపొందించిన జాబితాలో ఏపీ నుంచి బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ చోటుద‌క్కించుకొని తెలుగుజాతి గౌర‌వాన్ని, ప‌రువును నిలిపింది. ఎప్పుడూ రద్దీగా, అత్యాధునిక హంగుల‌తో, సౌకర్యాలతో ఉండే బెజ‌వాడ రైల్వే స్టేష‌న్‌పై కార్పొరేట్ గ‌ద్ద‌ల క‌న్ను ప‌డింది. అందుకు అనుగుణంగా కేంద్రం పావులు క‌దిపింది. నేరుగా ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం కంటే 99 ఏళ్ల లీజుకివ్వడమ‌నేది ఇప్పుడు కొత్త పద్దతి. 99 సంవ‌త్స‌రాల త‌ర్వాత నువ్వు చూస్తావా?? నేను చూస్తానా??.. అందుకే ఈ పద్దతిలోనే ప్రైవేటుకు ధారాద‌త్తం చేస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిజానికి గతంలోనే 30 ఏళ్ల లీజు పద్దతిన టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాక‌పోవ‌డంతో 99 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణ‌యించారు.

ముందు రైళ్లు... త‌ర్వాత స్టేష‌న్లు
భార‌త‌దేశంలోనే అత్య‌ధిక ర‌ద్దీగా ఉండే స్టేష‌న్ల‌లో విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ డివిజ‌న్ నుంచి వ‌చ్చే ఆదాయంమీదే రైల్వేబోర్డు ఆధార‌ప‌డివుందంటే అతిశ‌యోక్తి కాదు. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ప‌రిధిలో ఉన్న విజ‌య‌వాడ డివిజ‌న్‌పై ప్ర‌యివేటు సంస్థ‌ల క‌న్ను ఎప్ప‌టినుంచో ఉంది. క‌రోనా స‌మ‌యంలో కావ‌ల్సినంత ఖాళీ దొర‌క‌డంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు, ప్ర‌యివేటు పెద్ద‌ల ఆలోచ‌న‌లు ఒక రూపు సంత‌రించుకున్నాయి. ముందుగా రైళ్ల‌ను ప్ర‌యివేటుప‌రం చేస్తున్నారు. ఆ త‌ర్వాత స్టేష‌న్ల‌ను చేయ‌బోతున్నారు. ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండకూడదు.. అన్నీ ప్ర‌యివేటు చేతుల్లోనే ఉండాలన్నట్లుగా కేంద్రం తీరు ఉండ‌టం కార్పొరేట్ సంస్థ‌ల‌కు కూడా మంచి ఉత్సాహాన్నిస్తోంది.

అంబానీ, అదానీ హ‌వా
దేశంలో ఇప్పుడు అంబానీ, అదానీ గ్రూపుల హ‌వానే న‌డుస్తోంది. పెట్టుబడులు పెట్టాలన్నా… రైల్వే స్టేషన్లు, పోర్టులు కొనాలన్నా ఆ రెండు సంస్థలకే సాధ్యమవుతుంది. మిగతా ఏ భారీ కార్పొరేట్ సంస్థలు కూడా వాటి కోసం పోటీ పడే ప్రయత్నాలు చేయడంలేదు. ఎందుకంటే పోటీప‌డినా అవి వారికి రావ‌ని తెలుసు. కేంద్ర పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు వారిద్ద‌రికే ఉన్నాయి కాబ‌ట్టి.
ఇప్పటికే వేల కోట్ల‌రూపాయ‌లు ధార‌పోసి పోర్టులు కొనేస్తున్న కంపెనీలు.. రైల్వే స్టేషన్లను కూడా కొనేయడం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఏపీలోని ఆస్తులను దక్కించుకునేందుకు గుజరాతీ వ్యాపారులు పోటీ పడుతున్నారు. రోడ్లు, రైల్వేస్టేష‌న్లు, విమానాశ్ర‌యాలు, పోర్టులు... ఇలా కాదేదీ క‌విత‌న‌ర్హం అన్న‌ట్లుగా కాదేదీ కొనుగోలుకు అన‌ర్హం అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌డ్డించేవాడు మ‌న‌వాడైతే.. వ‌డ్డ‌న‌లో ఎక్క‌డ కూర్చున్నా మ‌న‌కు కావ‌ల్సింది మ‌న‌ద‌గ్గ‌ర‌కు వ‌చ్చితీరుతుంది.. అంతే!!

మరింత సమాచారం తెలుసుకోండి: