బ్లాక్ ఫంగస్ వైరస్ ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనే బయటపడుతోందని, కరోనా నివారణలో వాడే స్టెరాయిడ్స్ వల్ల షుగర్ నియంత్రణలోకి రాకపోవడంతో ఎక్కువమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కరోనా సోకిన షుగర్ వ్యాధిగ్రస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే కరోనా బాధితుల్లో 10 నుంచి 15 శాతానికి మించి షుగర్ వ్యాధి గ్రస్తులు ఉండరని, వారిలో వెయ్యిలో ఒకరికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ రాదని చెబుతున్నారు నిపుణులు. బ్లాక్‌ ఫంగస్‌ గురించి అనవసర ఆందోళన చెందొద్దని భరోసా ఇస్తున్నారు. షుగర్‌ నియంత్రణలో ఉంచుకుంటే బ్లాక్‌ ఫంగస్‌ గురించి భయపడాల్సిన పనే లేదని అంటున్నారు.

కరోనా బాధితులు స్టెరాయిడ్స్‌ వాడిన తర్వాత వారిలో షుగర్‌ లెవల్స్ ఎక్కువ అవుతాయి. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకూ షుగర్ ఉందని అని నిర్థారించుకోని వారికి కూడా కరోనా చికిత్స తర్వాత షుగర్ వ్యాధి బయటపడుతోంది. సహజంగా స్టెరాయిడ్స్ తో షుగర్ లెవల్స్ పెరిగిన తర్వాత సాధారణ డోసు మందులతో అది నియంత్రణలోకి రాదని వైద్యులు పేర్కొంటున్నారు. అలాంటి వాళ్లు షుగర్‌ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్‌ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్‌ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు. బరువు పెరుగుతారని, ఇతర ఇబ్బందులొస్తాయని చాలామంది ఇన్సులిన్ వాడకాన్ని పక్కనపెడుతున్నారని, అది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.

వీటికి దూరంగా ఉండాలి..
కరోనానుంచి కోలుకున్న షుగర్ వ్యాధిగ్రస్తులు అన్నం, ఇడ్లీలు, దోసెలు, బంగాళాదుంపతో చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్ కి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. జొన్నలు, రాగులు, కొర్రలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. సిట్రస్‌ జాతి పళ్లు తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉండే అవకాశముందని అంటున్నారు. పైగా సి విటమిన్ తో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, ఫంగస్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెబుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ అనేది లక్షలో ఒకరికి మాత్రమే వస్తుందని, దాని గురించి భయపడవద్దని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: