దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా కరోనా వ్యాప్తిని అరికట్టాలని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూతో సరిపెట్టాయి. అయితే తాజాగా కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, అది చిన్న పిల్లలపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా మొదటి వేవ్ సమయంలో సెకండ్ వేవ్ వస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊహించలేదు. దాంతో కరోనా జయించామని భావించి అన్నింటినీ షరామామూలుగా నడిపాం, ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్‌లో మరింత బలంగా వచ్చి దేశాన్ని అల్లకల్లోలం చేసింది. అయితే ఈ సారి థర్డ్ వేవ్ గురించి ముందే సమాచారం రావడంతో ప్రతి రాష్ట్రం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గారు కూడా ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పిల్లల ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను, ఔషధాలను, ఆక్సిజన్, ఐసీయూలు, వైద్యులు ఇలా అన్ని విధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే చిన్నపిల్లలకు కరోనా సోకితే వారికి తల్లుల అవసరం ఎక్కువగా ఉంటుందని ఆలోచించిన సర్కార్ 5 ఏళ్లలోపు వయసు పిల్లలున్న తల్లులకు వయో పరిమితి లేకుండా టీకాలు వేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రాష్ట్రమంతా సర్వేను నిర్వహించి, 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లుల సంఖ్యను తెలుసుకుంది. సర్వే పూర్తయిన వెంటనే తల్లులకు టీకాలు వేసేవిధంగా కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లులకు టీకాలు అందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆ టీకా కేంద్రాల్లో అవలంభిస్తున్న పద్దతిని చూస్తే తల్లులకు టీకాలు వేస్తున్నా పిల్లలకు మాత్రం రక్షణ లేదనిపిస్తోంది. టీకా కేంద్రాల వద్ద కరోనా నిబంధనలను పాటించకపోగా, కనీసం సామాజిక దూరాన్ని కూడా ఎవ్వరూ పాటించడం లేదు. దానికి తోడుగా టీకా వేయించుకునే ప్రతి మహిళ కూడా తమ పిల్లలను వ్యాక్సిన్ కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది. అక్కడ అప్పటికే కరోనా సోకిన మనిషి ఎవరైనా ఉంటే ఆ కరోనా చిన్న పిల్లలకు కూడా సోకే ప్రమాదం లేకపోలేదు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: