వర్తమాన రాజకీయాలు మాములుగా లేవు. వాటిలో వేగం బాగా పెరిగింది. గతంలో అయితే ఈ రోజు పని ఆ రోజు చేసేవారు. ఆ తరువాతకు వస్తే రేపటి పని నేడు చేయడం జరిగేది. ఇపుడు మాత్రం ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నిక దాకా నిరంతరం వ్యూహాలే. రాజకీయాలే.

ఏపీ లాంటి చోట అది మరీ ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే ఉన్నవి రెండే పార్టీలుగా, ఇద్దరు నేతల మధ్యనే బిగదీసుకుని కూర్చున్న రాజకీయం మూలంగా ప్రతీదీ గట్టిగానే ఉంటోంది. ఫైటింగ్ కూడా టఫ్ గా ఉంటోంది. ఏ ఒక్క అవకాశాన్ని అవతలి పక్షానికి ఇవ్వరాదు అన్నదే రెండు పార్టీల అధినాయకత్వాల అభిప్రాయం. ఏపీలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల రాజకీయం ఎప్పటిలాగానే ఉంది. ఇక జనసేన కూడా తనదైన రాజకీయం చేస్తోంది.

ఢీ అంటే ఢీ కొట్టి పాలిటిక్స్ చేసేది మాత్రం అటు టీడీపీ, ఇటు వైసీపీ, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల్లో ఒకటి అధికారంలోకి వస్తుంది అన్నది ఇప్పటికి ఉన్న అంచనా. మరి తరువాత సీన్ మారితే మారవచ్చు. అయితే అలాగని మిగిలిన పార్టీలు కూడా చేతులు ముడుచుకుని కూర్చున్నాయని కాదు, ఎవరి రాజకీయాలు ఆలోచనలు వారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోగా వీలున్నంతవరకూ తటస్థ నాయకులను వైసీపీలోకి లాగేయాలని ఆ పార్టీ చూస్తోంది.

కాంగ్రెస్ లో ఇంకా చాలా మంది బడా నాయకులు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడానికి కూడా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అదే విధంగా టీడీపీ కూడా ఉంది. అధికార వైసీపీలోని అసంతృప్తి నాయకులతో పాటు మిగిలిన పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలను తమ గూటిలోకి లాగాలని చూస్తోంది. ఇక బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా  కోస్తా జిల్లాల్లో తన సత్తా ఈసారి చూపించాలని అనుకుంటోంది. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటి వారికి కూడా గేలం వేస్తున్నారు అంటున్నారు. ముద్రగడ టీడీపీకి బహు దూరం. ఆయన్ని వైసీపీ, బీజేపీ తమ పార్టీలో చేరాలని గట్టిగానే కోరుతున్నాయట. అలగే కోస్తాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రికి కూడా గేలం వేస్తున్నారుట. మరి ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకూ పనిచేస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: