ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కేసీఆర్ తీసుకు వ‌చ్చిన ద‌ళిత‌బంధు పథ‌కం హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో ద‌ళిత కుంటుంబాని కేసీఆర్ ప‌ది ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఇది కూడా ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి పంపిణీ హామీలాగే మూల‌నప‌డిపోతుందా..? లేదంటే రైతుబంధు ప‌థ‌కంలా ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో అమ‌లు చేస్తారా అన్న‌దానిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ఈ ప‌థ‌కాన్ని కేసీఆర్ కేవ‌లం హుజురాబాద్ గెలుపు కోస‌మే తీసుకువ‌చ్చాడ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాకుండా కేవలం హుజురాబాద్ లోనే కాకుండా ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లాల‌లో ఉన్న ప్ర‌తి ద‌ళిత కుంటుంబానికి అంద‌జేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. 

తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు వీహెచ్ స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ...దళితులు... ధనికులు కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచనన చాలా బాగుందన్నారు. కేసీఆర్ ఏడేళ్ల తరువాత మొట్టమొదటి సారి అంబెడ్కర్ ఫొటోకు పూలమాల వేయడం చూస్తున్నాన‌ని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికి పదిలక్షలు ఇస్తేనే కేసీఆర్ దళిత బంధువు అవుతారంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వమే పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహం తీసి దళిత , బహుజనులకు ద్రోహం చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంబెడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం లాకప్ లో పెట్టంద‌ని వీహెచ్ మండిప‌డ్డారు. 

ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అంబెడ్కర్ విగ్రహాన్ని లాకప్ లో పెట్టి దళిత బంధు అంటే ఎవరూ నమ్మరంటూ వీహెచ్ అన్నారు. కేవలం హుజురాబాద్ లో దళిత బంధు అమలు చేస్తే అది ఉప ఎన్నికల కోసమని భావిస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళితబందు అమలు చేస్తేనే కేసీఆర్ కు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావిస్తామ‌ని వెల్ల‌డించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకంటే ముందే లాకప్ లో ఉన్న అంబెడ్కర్ విగ్రహం ఇవ్వాలంటూ వీహెచ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే కేసీఆర్ కు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా నమ్ముతామ‌ని అన్నారు. అంబెడ్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టేవరకు త‌న‌ పోరాటం కొనసాగుతుందని వీహెచ్ స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: