న్యాయవ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, ఈ హక్కును పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  ఎన్ వి రమణ అన్నారు. వేల సంవత్సరాల అణచివేత ఇక చాలు. న్యాయ వ్యవస్థ లోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. కోపంతో అరవాలి. 50 శాతం రిజర్వేషన్లు అవసరం అని అరవాలి. మీరు ఈ దిశ గా జరిపే పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అని జస్టిస్ రమణ  ఉద్ఘాటించారు. ఆదివారం నాడు అక్కడ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లోని మహిళా న్యాయవాదులు సీజేఐ జస్టిస్ ఎన్వి రమనతో సహా నూతనంగా నియమితులైన తొమ్మిదిమంది న్యాయమూర్తులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.


ఈ సభలో జస్టిస్  ఎన్ వి రమణ మాట్లాడుతూ కింది కోర్టులలో మహిళలు కేవలం 30 శాతం మాత్రమే ఉన్నారని, హైకోర్టులో 11.5 శాతం, సుప్రీంకోర్టులో 12 శాతం, మహిళలు ఉన్నారని, దేశంలో 17 లక్షల మంది న్యాయవాదులు ఉండగా వారిలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్ కౌన్సిల్ లలో ఎన్నికైన ప్రతినిధులు లోనూ కేవలం రెండు శాతం మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో మహిళా ప్రాతినిధ్యం లేదని, దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. అవసరమైన దిద్దుబాట్ల గురించి కార్యనిర్వాహక వ్యవస్థ పై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు. న్యాయవాద వృత్తి లోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్షత ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరువేల ట్రయల్ కోర్టులో  22% కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని తమ సర్వేలో తేలిందన్నారు. మహిళలకు న్యాయవ్యవస్థలో కి స్వాగతం పలికే సరైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. న్యాయ విద్యలో ప్రవేశించే దిశగా మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అప్పుడే మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు గణనీయంగా పెరుగుతారని, అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తినివ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: