టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీనీ హైటెక్స్ లో అంగ‌రంగ వైభంగా నిర్వహించింది. ఈ ప్లీన‌రీకి టీఆర్ఎస్ నేత‌లు కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. పార్టీ ఆవిర్భంచి 20 ఏళ్లు అయిన సంద‌ర్భంగా ప్లీన‌రీని అట్ట‌హాసంగా నిర్వ‌హించింది. 9వ సారి టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడిగా కేసీఆర్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ప్లీన‌రీలో పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీఆర్ విజ‌యాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేసీఆర్ ద‌ళిత‌బంధును ఎవ‌రూ ఆప‌లేరని అన్నారు. డిసెంబ‌ర్ నాటికి హుజురాబాద్‌లో వంద‌శాతం ద‌ళిత‌బంధును అమ‌లు చేస్తామ‌ని చెప్పారు.


   ద‌ళితబంధు పెట్టిన త‌రువాత ఏపీ నుంచి కూడా వేలాది విన్న‌పాలు వస్తున్నాయ‌ని ఆంధ్రాలో కూడా పార్టీని పెట్టాల‌ని గెలిపించుకుంటామని చెబుతున్నార‌ని అన్నారు కేసీఆర్‌. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు కావాల‌ని ఆంధ్ర ప్ర‌జ‌లు కోరుతున్నార‌ని చెప్పారు. త‌మ ప్రాంతాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌నే డిమాండ్లు వ‌స్తున్న‌ట్టుగా తెలిపారు. మ‌నం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను చూసి ప‌క్క రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని చెప్పారు.


  దేశ విదేశాల్లో కూడా తెలంగాణ వెలిగిపోతుంద‌న్నారు. ఇదిలా ఉంటే ప్లీన‌రీ వేదికపై రాష్ట్ర మంత్రి హ‌రీష్‌రావు, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత క‌నిపించ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే, వారు రాక‌పోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణాలు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. హుజురాబాద్ ప్ర‌చారంలో ఉన్న నేత‌లు ప్లీన‌రీకి దూరంగా ఉన్నారు. హుజురాబాద్ లో హ‌రీష్ రావు స‌హా ముగ్గురు మంత్రులు ప్ర‌చారంలో ఉండ‌డం కార‌ణంగా ప్లీన‌రీకి హాజ‌రుకాలేదు. అయితే, హ‌రీష్ రావు ప్లీన‌రీ గురించి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


  ఇక క‌విత బ‌తుక‌మ్మ సంబ‌రాల కోసం ఆమె దుబాయ్ వెళ్లినందున ఆమె రాలేక‌పోయార‌ని అంటున్నారు.  అయితే, వీరిద్ద‌రు ప్లీన‌రీకీ రాక‌పోవ‌డంపై ప‌లు విధాలుగా వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రోవైపు కావాల‌నే వాళ్లిద్ద‌రూ 20 వ‌సంతాల గులాబీ వేడుక‌కు హాజ‌ర‌వ్వ‌లేద‌నే గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.మరింత సమాచారం తెలుసుకోండి: