వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... కేంద్రాన్ని ఎదిరించారు. ధీటుగా పోరాటం చేశారు. ఒంటరిగా పార్టీ పెట్టారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కష్టాలు భరించారు. ఒంటి చేత్తోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు వైఎస్ జగన్. సుదీర్ఘ కాలం ప్రజల్లోనే ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. నేను ఉన్నాను... నేను విన్నాను... అంటూ హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కూడా తానే సుప్రీం అయ్యారు. తిరుగులేని నేతగా ఎదిగిన వైఎస్ జగన్... అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశానంటూ చెప్పుకున్నారు. రెండున్నర ఏళ్ల పాటు ఏకచత్రాధిపతిగా వెలిగిన వైఎస్ జగన్‌కు ఇప్పుడు ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇంకా చెప్పాలంటే.. కొద్ది రోజులుగా ఆయనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులపై సాధారణ ప్రజలు సైతం కీలకంగా చర్చించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే... రాజకీయాలు లోతుగా పరిశీలిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాల  అమలు పైనే ప్రధానంగా దృష్టి పెట్టిన జగన్... వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల్లో కూడా అవే తమకు ఓట్లు కురిపిస్తాయని బలమైన నమ్మకంతో కూడా ఉన్నారు. నవరత్నాల కోసం పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని కూడా వెచ్చిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కరంగా మారినప్పటికీ... జగన్ మాత్రం వాటి అమలుకు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇదే ఇప్పుడు అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యేలా చేస్తోంది. అసలు అభివృద్ధి అనే మాటే జగన్ సర్కార్ మాట్లాడటం లేదని రాజకీయ విశ్లేషకురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పధకాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేసినట్లు ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే... భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు విమర్శకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: