ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన, జిల్లాలకు పేరుమార్పు, సరిహద్దుల మార్పు వంటి అంశాలు కొంతకాలంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ గతంలో ప్రత్యేకంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఒక ఉపసమితిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాల పునర్విభజనపై చర్చించి నివేదిక ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటివరకు ఆ కమిటీ ఎటువంటి పనులు ప్రారంభించలేదు.ఇదిలా ఉండగా, కేంద్ర గణాంక శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 31, 2025 నాటికి జిల్లాలు, మండలాలు, పోలీస్ స్టేషన్ల సరిహద్దులు ఖరారు చేయాలని, లేకపోతే ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ఎలాంటి మార్పులు పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.


ఒకసారి గడువు ముగిసిన తర్వాత 2028 వరకు కొత్త జిల్లాలు సృష్టించడం గాని, జిల్లాలకు పేరుమార్పు చేయడం గాని అసాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టాలని భావించినా, వాస్తవానికి ఇప్పటివరకు ముందడుగు వేయలేదు. కాగా, జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వానికి విభిన్న ఒత్తిడులు ఎదురవుతున్నాయి. కొందరు నాయకులు కొత్త జిల్లాలు ఏర్పరచాలని కోరుతుంటే, మరికొందరు ఇప్పటికే ఉన్న జిల్లాల పేర్లను మార్చాలని పట్టుబడుతున్నారు. అదే సమయంలో, అదే జిల్లాలోని మరో వర్గం ఈ మార్పులకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపిస్తోంది. వీరంతా సీనియ‌ర్ నేత‌లు కావ‌డంతో ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితి.


తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా జిల్లాల పునర్విభజన అంశంపై ఒక్క మాట చర్చ జరగలేదు. దీనివల్ల జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై ఏర్పాటు చేసిన కేబినెట్ స‌బ్‌క‌మిటీ నిజంగానే పని చేస్తున్నదా, లేక ఈ అంశం పూర్తిగా పక్కన పెట్టబడిందా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూడా స్థానికంగా వస్తున్న ఫిర్యాదులు, ప్రతిపాదనలను పరిష్కరించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కులగణన మొదలుకానుంది. 2027లో జనాభా గణన ప్రారంభమవుతుంది. ఈ రెండూ పూర్తయితే 2028 వరకు సమయం తీసుకుంటాయి. అంటే 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ అంశం పూర్తిగా మరుగున పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: