- టిటిడి ఇవోగా శ్యామలరావును బదిలీ చేయడంపై రామచంద్రయాదవ్ ఫైర్
- బిసి సామాజిక వర్గ అధికారి కావడంతోనే 15 నెలల్లోనే సాగనంపారు
- టిటిడి ఛైర్మన్ తో పొసగటం లేదనే బదిలీ
- పదవి ఇచ్చి అధికారం ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం


రాష్ట్రంలో బిసి సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారుల ఎదుగుదలను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటోందని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన శ్యామలరావును టిటిడి ఇవో బాధ్యతల నుంచి తప్పించడాన్ని ఆయన ఖండించారు. టిటిడిలో అనేక సంస్కరణలు తీసుకువచ్చే బాధ్యత ఇవోపై ఉంటుందని, ఆయన బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు అక్కడ స్వేచ్చ లేకుండా చేశారని దుయ్యబట్టారు. టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు చెప్పినట్టు వినడం లేదనే ఆయన్ని బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విదుల చేశారు. టిటిడి ఇవోగా బిసి సామాజిక వర్గానికి చెందిన శ్యామలరావును నియమించామని సోషల్ మీడియాలో టిడిపి నేతలు తెగ ప్రచారం చేశారన్నారు. బిసిలకు తాము పెద్ద పీఠ వేస్తున్నామని సోషల్ మీడియా పోస్ట్ లతో ఊదరగొట్టారని తెలిపారు. కానీ ఇప్పుడు అదే బిసి సామాజిక వర్గానికి చెందిన ఐఎఎస్ అధికారిని బదిలీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.


గతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్ద పీఠ వేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అటుఇటుగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఎఎస్ లకు ముఖ్యమైన స్ధానాల్లో పోస్టింగ్ లు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... వాళ్లకు ఏమేర స్వేచ్చను ఇచ్చారో కూడా సమాధానం చెప్పాలన్నారు. ఐఎఎస్ అధికారులకు సామాజిక వర్గాన్ని తొలుత ప్రభుత్వం అంటగట్టిందన్నారు. కూటమి ప్రచారం చేసినందుకే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బిసి సామాజిక వర్గానికి చెందిన అధికారులు, ఉద్యోగులకు బిసివై పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సామాజిక సాధికారత తమతోనే సాధ్యం అని ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు... టిటిడి ఇవో బదిలీపై సమాధానం చెప్పాలన్నారు. గతంలో ఇవోలుగా కనీసం మూడేళ్లకు పైగా పనిచేసిన సందర్భాలున్నాయని, శ్యామలరావును కక్షతోనే బదిలీ చేశారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: