ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడికి క‌రోనా సోక‌డంతో స్థానికంగా క‌ల‌క‌లం రేగుతోంది. పాయకరావుపేట మండలంలో అరట్లకోట గ్రామానికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి(40)కి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కాకినాడ నుంచి బుధవారం రాత్రి విశాఖలోని విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు నక్కపల్లి మండలం వేంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు. పాయకరావుపేట పట్టణంలో రాజుగారి బీడు ప్రాంతంలో నివాసం ఉంటూ పాఠ‌శాల‌కు వెళ్లి వ‌స్తూ ఉండేవారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే. కరోనా వైరస్ కార‌ణంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో భార్యాపిల్లలను తూర్పుగోదావ‌రి జిల్లా కత్తిపూడిలోని అత్తవారింటికి పంపించాడు. ఆ త‌ర్వాత‌ పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆయ‌న‌ కూడా కత్తిపూడి వెళ్లారు.

 

అయితే.. ఇక‌ అప్పటి నుంచి అక్కడే ఉంటున్న ఉపాధ్యాయుడికి వారం కిత్రం జ్వరం, జలుబు తీవ్రంగా ఉండటంతో స్థానిక ఆర్‌ఎంపీ వ‌ద్ద చూపించుకున్నారు. కానీ.. త‌గ్గ‌క‌పోవ‌డంతో కాకినాడలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లగా అక్కడ పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంట‌నే అధికారులు ఉపాధ్యాయుడిని విశాఖలోని విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. వెంట‌నే అప్రమత్తమైన కత్తిపూడి వైద్య సిబ్బంది ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులతో పాటు ప్రాథమిక వైద్యం చేసిన ఆర్‌ఎంపీ వైద్యుడు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లతో సహా మొత్తం 38 మంది నుంచి శాంపిళ్లు సేకరించి కాకినాడలోని క్వారంటైన్‌ వార్డుకు తరలిస్తున్నారు. అయితే.. ఉపాధ్యాయుడికి కరోనా వైరస్‌ ఎక్కడ సోకిందనేదన్న విష‌యం మాత్రం అంతుచిక్క‌డం లేదు. దీనిపై వైద్య‌వ‌ర్గాలు ఆరా తీస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: