
ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ఒంగోలు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న ఆయన జగన్ తొలి కేబినెట్‌లో విద్యుత్, అటవీ శాఖల మంత్రిగా పదవి స్వీకరించారు. అయితే.. ఆదిలో ఆయన ఉత్సాహంగా ఉన్నా.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను సమర్ధించినా.. ఇటీవల జరిగిన ఒక పరిణామంతో ఆయన జగన్‌పైనే అలిగి.. జిల్లాను వదిలేసి.. హైదరాబాద్‌కే పరిమితమయ్యారని అంటున్నారు అనుచరులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. జగన్ తన మంత్రి వర్గాన్ని మారుస్తున్నారు. ఈ క్రమంలో అందరినీ తీసేసి.. కొత్తవారిని నియమిస్తామని.. అన్నారు. దీనికి మొదట్లో బాలినేని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట మీడియాకు చెప్పారు.
``కేబినెట్ పూర్తిగా మారిపోతుంది. అంతా సీఎం జగన్ ఇష్టం. ఆయన ఏం చెప్పినా.. చేసేందుకు మంత్రులుగా.. పార్టీ కార్యకర్తలు గా మేం సిద్ధం. ఈ విషయంలో రెండో మాటకు ఛాన్స్ లేదు`` అన్నారు. దీంతో బాలినేని ప్రకటన తర్వాత.. మిగిలిన మంత్రులు కూడా మానసికంగా.. సిద్ధమయ్యారు. అయితే.. ఇటీవలకాలంలో సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన బాలినేని.. పెద్ద వార్త తెలిసింది. ప్రకాశం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరిలో.. ఒకరు బాలినేని అయితే.. రెండో వారు.. ఆదిమూలపు సురేష్. వచ్చే మంత్రి వర్గంలో బాలినేనిని పక్కన పెట్టినా.. సురేష్‌ను కొనసాగిస్తున్నట్టు సీఎం స్వయంగా బాలినేనికి చెప్పారట. దీంతో ఆయన వెంటనే తన నియోజకవర్గం వచ్చి.. కొద్దిమందిని కలిసి.. వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా ఒకటి రెండు రోజులు వచ్చి.. తర్వాత హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయంపై తాడేపల్లి వర్గాలు ఆరాతీయగా.. బాలినేని అనుచరులు.. కీలక నాయకులు.. కొందరు ఆయనను సమర్ధించే ఎమ్మెల్యేలు.. విషయం వెల్లడించారు. దీంతో మళ్లీ సీఎం జగన్.. స్వయంగాఆయనను పిలిచి మాట్లాడారు. మంత్రి పదవి నుంచి తీసేసినా.. కీలక బాధ్యతలు అప్పగిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. సురేష్‌ను మాత్రం కొనసాగిస్తానని చెప్పారట. అయితే. బాలినేని దీనికి అంగీకరించలేదని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముభావంగానే మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.