తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు  తమదే అన్నట్లుగా టిఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తూ,  ప్రత్యర్థులను మరింత కంగారు పెడుతూ, పైచేయి సాధిస్తూ ఉంటారు. తెలంగాణలో టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు అందరూ బలహీనంగా ఉండడంతో, అదే తమ బలం గా చేసుకుని టిఆర్ఎస్ ఎదురులేకుండా, తమ హవా నడిపిస్తూ వస్తోంది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 99 డివిజన్ లను సొంతం చేసుకుంది. అదే ఊపుతో ఇప్పుడు కూడా వందకు పైగా డివిజన్లను తమ ఖాతాలో వేసుకోవాలని టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పూర్తిగా అక్కడే దృష్టి సారించారు. టీఆర్ఎస్ గెలుపునకు అవసరమైన అన్ని ఎత్తుగడలు వేశారు.



 పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో,  ఇక విజయం తమదేనని ధీమాలో ఉండగా, అకస్మాత్తుగా హైదరాబాద్ ను వరదలు ముంచెత్తడం, గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఇళ్ళు, రోడ్ లు మునగడం, జనాలు కొట్టుకుపోవడం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. సహజంగానే ఆ ప్రభావం అధికార పార్టీ మీద పడింది. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు ముందస్తుగా తీసుకుని ఉంటే, ఇంతటి వరద నష్టాన్ని జనాలు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని, భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని , ప్రజలలో అభిప్రాయం ఉంది. 1908లో ఒకసారి ఎంతటి భారీ వర్షం రాగా, మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో వర్షం కురిసింది. ఇక ఎక్కడికక్కడ ప్రజలు అధికార పార్టీ నేతలను నిలదీస్తూ, వారిపై దాడులు చేసేందుకు కూడా వెనుకాడకపోవడం టిఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరంగా మారింది.



 దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ , బీజేపీలు గట్టిగా హడావుడి చేస్తూ, ప్రజలను మరింత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ, టిఆర్ఎస్ పార్టీ హవా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తుండడంతో కేటీఆర్ రంగంలోకి దిగి వరద సహాయం పెంచి ఇస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలతోపాటు, దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉండడంతో, ఏదో రకంగా ఎన్నికలు జరిగే ఈ ప్రాంతంలో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా, టిఆర్ఎస్ ఈ స్థాయిలో డ్యామేజ్ అయిపోతుంది అని ఎవరూ ఊహించలేదు. అనుకోని వరద ముప్పుతో టిఆర్ఎస్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

మరింత సమాచారం తెలుసుకోండి: