అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డు ఇవ్వాలనే ఆలోచనను ఇటీవల వెలిబుచ్చారు. ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్ యొక్క ఎపిసోడ్‌లో ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ కాగానే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని తాను అనుకుంటున్నానని ప్రకటించారు. అది రెండేళ్లు.. నాలుగేళ్లు.. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేకుండా ఉంటుందని ట్రంప్ అన్నారు.


అంతే కాదు.. జూనియర్‌ కాలేజ్‌లకు కూడా దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నాను అని ట్రంప్ అంటున్నారు.  తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కరోనా వైరస్‌ కారణంగానే గతంలో దీన్ని అమలు చేయలేకపోయానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. గతంలో ట్రంప్‌ వలసలకు వ్యతిరేకంగా ఉండేవారు. అమెరికా ఉన్నది అమెరికన్ల కోసమేనంటూ జాతిని రెచ్చగొట్టేలా మాట్లాడేవారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ప్రాధాన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మార్చేశారు.


బహుశా.. అమెరికాలో ఉంటున్న విదేశీయుల ఓట్లు కొల్లగొట్టేందుకు ఇలా స్టాండ్ మార్చి ఉండొచ్చు. ఏదేమైనా అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లే ప్రతీ ఒక్కరి కల అయిన గ్రీన్‌ కార్డు ఇకపై సులభంగా లభించబోతోంది. ఇంతకీ ఈ గ్రీన్‌ కార్డు ప్రత్యేకత ఏంటి.. ఈ కార్డు వస్తేనే ఎవరికైనా అమెరికా పౌరసత్వం వస్తుంది. గ్రీన్ కార్డ్ ఉండటం వల్ల అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే అవకాశం దక్కుతుంది. ఆ తరువాత అదే గ్రీన్ కార్డు సిటిజన్ షిప్ కు మార్గం సుగుమం అవుతుంది.


ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు ఇండియా, చైనా వంటి దేశాల నుంచి వలసలు మరింతగా పెరగనున్నాయి. ప్రత్యేకించి అమెరికా వెళ్లడం స్టేటస్‌ సింబల్‌గా భావించే మన ఇండియా.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని వారు తమ పిల్లలను ఇంటర్‌ కోసం కూడా ఇక అమెరికా పంపుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: