
అంతేకాకుండా జాగృతి ఆవిర్భావంలో తమకూ సమాన హక్కు ఉందని, కాబట్టి ఆ సంస్థపై కవితకు మాత్రమే అధికారం లేదని స్పష్టంచేశారు. జాగృతి అనేది బీఆర్ఎస్‌కు అనుబంధంగానే ఏర్పడిందని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలకే తాము లోబడి ఉంటామని వారు తెలిపారు. కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే జాగృతిలో చీలిక రావడం గమనార్హం. ఇది కవితకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఇటీవల హరీశ్ రావు, సంతోష్ రావులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత ఉద్రిక్తతలకు నాంది పలికాయి. ఆ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో తండ్రి కేసీఆర్‌తో దీర్ఘ చర్చలు జరిపారు. ఆ మంతనాల ఫలితంగా కవితపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇప్పటికీ కేటీఆర్ అదే ఫార్మ్ హౌస్‌లో ఉండి, భవిష్యత్ వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నారని సమాచారం. కవితను రాజకీయంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా కేటీఆర్ మరింత కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాగృతిని కూడా ఆమె నుంచి లాగేయడం ఆ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. మొత్తానికి, బీఆర్ఎస్‌లో కవిత పరిస్థితి రోజు రోజుకూ క్లిష్టతరం అవుతోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జాగృతి కూడా ఇప్పుడు ఆమె చేతిలోనుంచి జారిపోతున్నట్లుంది. కేటీఆర్ కఠిన వైఖరితో కవిత భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో చూడాలి.