కూరగాయల ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గిపోతాయో తెలుసుకోవడం చాలా కష్టం.  ప్రస్తుతం కూరగాయల ధరలు అందుబాటులో ఉన్న టమాటా ధర మాత్రం పైపైకి పెరిగిపోతున్నది.  టమాటా ధర పెరిగినా.. తగ్గినా నగరంలో దొరికే టమాటాను కొనేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కొనాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  కూరగాయలను పురుగుల బారినుంచి రక్షించేందుకు పురుగుమందులను పిచికారీ చేస్తారు.  


అయితే, కూరగాయలపై ఈ ఇలా పిచికారీ చేసిన పురుగు మందుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది.  వాటిపై ఆ మందుల తాలూకు కణాలు అలానే ఉంటున్నాయి.  ఫలితంగా వాటిని తీసుకెళ్లి శుభ్రంగా కడకుండా వండేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  పురుగుమందులను పిచికారీ చేసిన వారం రోజుల తరువాత కాయలను కోయాలి. ఒకసారి పురుగుమందు కొట్టి వారం రోజులు ఆగితే.. కూరగాయలపై మచ్చలు వస్తాయి.  అలంటి వాటికి ధర తక్కువగా ఉంటుంది.  


అందుకే చాలామంది పురుగుమందులు కొట్టిన మరుసటిరోజే వాటిని కోసి మార్కెట్ కు తరలిస్తారు.  అలాంటి కూరగాయలు చూసేందుకు బాగుంటాయి.  తింటే విషం శరీరంలోకి వెళ్తుంది.  మరి అలాంటి వాటిని తినకుండా అలానే వదిలేయాలా అంటే అవసరం లేదని అంటున్నారు.  మార్కెట్లో కొనుగోలు చేసిన వాటిని ఇంటికి తీసుకెళ్లి ఉప్పునీళ్లలో శుభ్రంగా కడగాలి.  ఒకటికి నాలుగుసార్లు కడిగిన తరువాత మాత్రమే ఆ కూరగాయలను వంటకు వినియోగించాలని లేదంటే అనారోగ్యం పాలవ్వడం ఖాయం అని అంటున్నారు శాస్త్రవేత్తలు.  


"పంటకు తెగులు సోకిన పక్షంలో దాని నియంత్రణకు ఏ మందును, ఎంత మోతాదులో పిచికారీ చేయాలనే అంశంలో నిర్ణీత ప్రమాణాలున్నా వాటిని ఎవరూ పాటించడం లేదు. ఆయా మందుల ప్యాకెట్లపై ఉండే వివరాలను రైతులు చదవడం లేదు. పురుగుమందుల దుకాణాల వ్యాపారులు, తమకు ఎక్కువ కమీషన్‌ వచ్చే.. అనుమతి లేని అత్యంత విషపూరిత రసాయన మందులను రైతులకు సిఫార్సు చేస్తున్నారు. రైతులూ వాటిని విచ్చలవిడిగా పంటలపై పిచికారీ చేస్తున్నారు. ఆయా ఉత్పత్తులను తిన్న మనుషుల కడుపులోకి నేరుగా ఆయా రసాయనాలు వెళ్తున్నాయి." అని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ పేర్కొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: