ఆయన గొప్ప భావుకుడు. ఆయనలో అద్భుతమైన కవి ఉన్నాడు. ఆయన వంశమే పండిత వంశం. ఆయన ఇంట్లోనూ వంట్లోనూ కవిత్వం అలా ప్రవహిస్తూ వచ్చింది. ఆయనే భావ కవి దేవులపల్లి వెంకట క్రిష్ణ శాస్త్రి. ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఎన్నతగినది. ఆయన అనూహ్యంగా సినీ సీమలో ప్రవేశించారు.

తన వంతుగా ఎన్నో పాటలతో సరికొత్త గుభాళింపు తీసుకువచ్చారు. ఆయన తొలి సినిమా మల్లీశ్వరి పాటలు ఆనాటికీ ఏనాటికీ కూడా మరచిపోలేని మధుర కావ్యాలు. మల్లీశ్వరి సినిమాకు పాటలు, మాటలు రాసిన దేవులపల్లి ఆ తరువాత సినిమా పరిశ్రమలో కొనసాగాలనుకోలేదు. అందుకే ఆయన ఎక్కువగా పాటలు రాయలేదు. కానీ తమకు పాటలు ఆయనే రాయాలని, అది తమ సినిమాకు గౌరవం అని నిర్మాతలు దర్శకులే కాదు హీరోలు కూడా భావించే వారు.

అలా తమకో పాట రాయమని ఆయన ఇంటికి క్యూ కట్టేవారట. ఆయన పాట ఒక్కటి ఉన్నా చాలు తమ సినిమా క్లాసిక్ గా నిలుస్తుంది అన్నది నాటి చిత్ర నిర్మాతల నమ్మకం. అలా నాటి చలన చిత్రాలలో  దేవులపల్లి  రాసిన పాటలు  ఎన్నో ఉన్నాయి. మేడంటే మేడా కాదు, ఇది మల్లెల వేళయని అన్న పాటలు ఇప్పటికీ శ్రోతల చెవుల్లో మారుమోగుతూంటాయి. మావి చిగురు తినగానే కోయిల పలికేనా  అన్న పాట సీతామాలక్ష్మి సినిమాలో నాడు ఒక ఊపు  ఊపేసింది.

ఇదిలా ఉంటే ఒక దశలో ఆయన గొంతు మూగపోయింది. ఆయన తాము చెప్పదలచుకున్నది కాగితం మీదనే రాసిపెట్టేవారు. అలా శోభన్ బాబు, శారద న‌టించిన బలిపీఠం సినిమాలో ఒక యుగళగీతం ఆయన మాటల నుంచే పుట్టుకొచ్చింది. ఆ సినిమా పాటల కొరకు  తన వద్దకు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తిని ఉద్దేశించి ఆయన కుశలమా అని కాగితం మీద రాశారట. అది తన పాటకు పల్లవి అనుకుని చక్రవర్తి సూపర్ గురువు గారూ ఇలాగే రాసేయండి అనడంతో కుశలమా అన్న పాట పుట్టిందని చెబుతారు. ఏది ఏమైనా ఆయన భావుకత్వంతో నిండిన ఎన్నో పాటలను తెలుగు సినీ సీమకు ఇచ్చి వాటిని శాశ్వతం చేశారు. ఈ రోజు ఆయన వర్ధంతి వేళ ఘన నివాళిని అభిమానులు అర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: