దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో నేడు జ‌రిగే కీల‌క స‌మావేశంపై అంద‌రి దృష్టి ప‌డింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని మోదీ తొమ్మిది రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా కట్టడి చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించనున్నారు.



దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 22లక్షలు పాజిటివ్‌ కేసులు  నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 6.34లక్షల యాక్టివ్‌ కేసులు ఉండగా, 15.34లక్షల రోగులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 44వేల మందికిపైగా వైరస్‌ ప్రభావంతో మరణించారు. ఈ మ‌హ‌మ్మారి విస్తృతి నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, చీఫ్ సెక్రెటరీలతో సమావేశం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ఇక ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, డాక్టర్‌ హర్షవర్ధన్‌, కిషన్ రెడ్డి, కేబినెట్ సెక్రెటరీ, హోం శాఖ సెక్రెటరీ ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొననున్నారు. ఈ కీల‌క‌మైన‌ సమావేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రభావం, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.


ఇదిలాఉండ‌గా, కరోనా బాధితులకు వైద్యం అందించే వైద్యులు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 196 మంది డాక్టర్లు చనిపోయినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) గ‌త‌ శనివారం ప్రకటించింది. డాక్టర్ల ఆరోగ్యంపై కూడా ప్రధాని మోదీ దృష్టి సారించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు ఏదో ఒక చోట వైద్యులు చనిపోతున్నారు. ఇందులో అధికంగా జనరల్‌ వైద్యులు ఉన్నారు. వైద్యుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ రాసింది. అన్ని విభాగాల్లో పని చేసే డాక్టర్లతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: