ఏపీలో ఇకపై బస్ కండక్టర్ల వద్ద టికెట్ కొట్టే మిషన్లు కనిపించవు. అతి త్వరలో వీటికి ప్రత్యామ్నాయం రాబోతోంది. ఇప్పటి వరకూ టికెట్ కొట్టి ఇచ్చే టిమి మిషన్లలో కేవలం టికెట్ ప్రింటింగ్ మినహా ఇతర సాఫ్ట్ వేర్ ఏదీ ఉండదు. అయితే తొలిసారిగా టిమి మిషన్ల స్థానంలో ఈపోస్ యంత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేయించుకునే మిషన్ లాంటిది అనమాట. ఇకపై ఏ బస్సులో అయినా కండక్టర్ టికెట్ కొడితే వెంటనే ఆ సమాచారం సెంట్రల్ సర్వర్ కి ఈపోస్ మిషన్ ద్వారా చేరిపోతుంది. ఏ బస్ లో ఎంతమందికి టికెట్ కొట్టారు, ఏ సీటు రిజర్వేషన్ అయింది, అనే విషయం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్ లో నిక్షిప్తం అవుతుంది. దీంతో ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుందని, బస్సు స్టేషన్ కి వచ్చే లోపే లోపల ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయనే విషయం తెలిసిపోతుందని అంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓ యాప్ ని డిజైన్ చేస్తున్నారు. అతి త్వరలో ఇది ఏపీలోని ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న బస్ ‌ను ప్రయాణికుడు అందుకోలేకపోయినా.. అదే రూట్‌లో తర్వాత వచ్చే మరో సర్వీసులోకి మార్చుకునే అవకాశం వస్తుంది. ఇలా దాదాపు 12-15 రకాల సేవలను ఒకే యాప్‌లో లభించేలా యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ యాప్‌ ను ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. గతంలో దీన్ని ప్రథమ్ అనే పేరుతో పిలుస్తున్నా.. పూర్తి స్థాయి మార్పులతో ఇప్పుడీ యాప్ ని సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీలో ఆన్‌ లైన్‌ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌, బస్‌ ట్రాకింగ్‌, పార్శిల్‌ బుకింగ్ ‌లకు మూడు వేర్వేరు యాప్‌లున్నాయి. ఇకపై ఈ సేవలన్నీ ఒకే యాప్‌లో లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌ మొత్తానికి రూ.70 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

డిజిటలైజేషన్‌ ప్రోత్సాహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ కు కేంద్రం 10నుంచి 20 కోట్ల రూపాయల సాయం అందిస్తుంది. వచ్చేనెలలో దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తారు. ఈ యాప్‌ ద్వారా బుక్‌ అయ్యే ఒక్కో టికెట్‌కు సగటున 15 పైసల చొప్పున టెండరు దక్కించుకునే సంస్థకు కమిషన్‌ ఇస్తారు. పల్లెవెలుగు, సిటీ బస్సులు మొదలు దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని తరహా బస్సుల టికెట్లను యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి బస్సు ట్రాకింగ్ ‌లో కనిపిస్తుంది. ఎంత సమయానికి బస్టాండ్‌ వస్తుందో చూసుకొని ప్రయాణికులు వెళ్లేందుకు వీలుంటుంది. ప్రస్తుతానికి ఆన్‌ లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయం ఉన్న బస్సుల ట్రాకింగ్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపై దీన్ని అన్ని బస్సులకు అనుసంధానిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: