ఆయన ఓ మాజీ మంత్రి గారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేత కూడా. కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఏం చేయాలో తెలియలేదు. చివరికి కుటుంబ అవసరాల కోసం ఏం చేస్తున్నారో తెలుసా... పిజ్జా డెలివరీ బాయ్ గా మారిపోయారు. కంగారు పడకండి.. ఈయన మన దేశ మంత్రి గారు మాత్రం కాదు. ఆఫ్గానిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్. 2018లో ఆష్రఫ్ ఘనీ మంత్రివర్గంలో సయ్యద్ అహ్మద్ చోటు దక్కించుకున్నారు. ఎంతో కీలకమైన కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఎన్నో కీలక విషయాల్లో తన ప్రతిభ చూపించారు కూడా. అయితే ప్రధాని ఆష్రఫ్ ఘనీతో విభేదాల కారణంగా 2020 డిసెంబర్ లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆఫ్గానిస్తాన్ దేశాన్ని వదిలేశారు. అక్కడి నుంచి జర్మనీకి కుటుంబ సమేతంగా వలస వెళ్లారు. కొద్ది రోజుల వరకు ఆ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సయ్యద్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉన్న నాలుగు డబ్బులు కూడా అయిపోయాయి. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక అంతే... ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా సరే అని రంగంలోకి దిగారు. జర్మనీలోని లివ్ నార్డో అనే సంస్థ తరఫున ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. ఇదే విషయాన్ని సయ్యద్ అహ్మద్ స్వయంగా వెల్లడించారు. స్కై న్యూస్ ప్రతినిధితో ముచ్చటించిన సయ్యద్... ప్రస్తుతం తాను పిజ్జా డెలివరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఆఫ్గాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాలిబన్లు దాడి చేసే అవకాశం ఉందని తాను ముందే హెచ్చరించినట్లు సయ్యద్ వెల్లడించారు. కానీ... ఆ రోజు తన మాటను ప్రధాని ఆష్రఫ్ ఘనీ పెద్దగా పట్టించుకోలేదని... అందువల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్నారు. ఒకప్పుడు చుట్టూ మంది మార్భలం, భద్రతా సిబ్బంది మధ్య రాజభోగాలు అనుభవించిన సయ్యద్ అహ్మద్... ప్రస్తుతం ఓ సైకిల్ పైన జర్మనీ వీధుల్లో తిరుగుతూ... పిజ్జా డెలివరీ చేస్తున్నారు. ఆసియా, అరబ్ దేశాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులు... ఇతర దేశాల్లో ఎలా ఉంటారో అనేది సయ్యద్ అహ్మద్ జీవితం ఓ ఉదాహరణ మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: