మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనికులతో భేటీ అయిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంత కాలం సామాజిక కార్యకర్తగా మాత్రమే పనిచేశానన్న జనసేనాని... ఇకపై అసలైన రాజకీయ నేతగా వ్యవహరిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు పవన్. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఒక కులానికే ప్రాధాన్యత ఇచ్చేలా వ్యవహరిస్తోందని... ఇతర కులాల వాళ్లు మీ దృష్టిలో మనుషులు కాదా అని ప్రశ్నించారు జనసేనాని. రాష్ట్రంలో ఇతర కులాలను దెబ్బ తీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల వ్యవహారాన్ని కూడా పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2016 జనవరిలో కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించింది వైసీపీ వర్గాలు మాత్రమే అని ఆరోపించారు. రైలు దగ్ధం చేసింది కూడా కాపు కులానికి చెందిన వారు కాదని... అల్లరి మూకలే ఈ పని చేశాయన్నారు జనసేనాని.

కాపు ఉద్యమాన్ని వైసీపీ వర్గాలు కావాలనే పక్కదారి పట్టించాయని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైసీపీకి కమ్మ కులస్తులు బద్ధ శత్రువులు అని వ్యాఖ్యానించారు. ఒక కులాన్ని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమి కొట్టాలనే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎవరికైనా కులం కాదు... గుణం ప్రధానం అన్నారు పవన్. 151 సీట్ల బలం ఉందని ఒక వర్గాన్ని పూర్తిగా తొక్కేస్తాం అంటే చూస్తూ ఊరుకోవాలని అని పవన్ వార్నింగ్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనసేనాని ప్రశ్నించారు. ఉద్యమాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు తనపై కులం పేరుతో ఆరోపణలు చేస్తున్నారని... రాబోయే ఎన్నికల్లో మీరా... మేమా తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు పవన్ కల్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో రెచ్చిపోయారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: