మనం ఈరోజు ఇంత స్వేచ్చగా జీవిస్తున్నాం అంటే అందుకు కారణం ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలం. ఆనాడు మన వీరులు ప్రాణ త్యాగం మనకు ఈ రోజు ఇలా బ్రతికే అవకాశానికి కారణం అయ్యింది. స్వాతంత్రం అనగానే మనకు ముందు గుర్తొచ్చే నాయకుడు మన జాతిపిత గాంధీజీ. స్వాతంత్ర సమర యోధుడిగా, సత్యాన్ని మాత్రమే పలికే మహనీయుడుగా, అహింసావాదిగా, పట్టువదలని భారత ముద్దు బిడ్డగా ఆయన జీవిత గాధ ఎందరికో ఆదర్శం.  యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన మహాత్ముడు గాంధీజీ గురించి అందరికీ తెలుసు. అయితే ఆయన చివరి రోజుల్లో జీవనం ఎలా సాగింది. ఆయన ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే విషయాలను నేడు ఆయన జయంతి సందర్భంగా మరలా ఒకసారి గుర్తుచేసుకుందాం.

రేపే మీ చివరి రోజు అన్నట్లుగా జీవించండి. రేపు కూడా జీవించాలనే దృక్పథంతో మీరు నిరంతరం నేర్చుకోండి.
అని నినదిస్తూ ప్రతి రేపును ఆయన చివరి రోజుగా భావించి... ఆ ఒక్క రోజు కూడా ప్రజల కోసమే జీవించాలని సంకల్పించి తన చివరి క్షణం వరకు కూడా ప్రజల కోసమే జీవించాడు. జనాల భవిష్యత్తే ఊపిరిగా బ్రతికిన ఆ మహనీయుడు చివరికి ప్రజలకోసమే మరణించాడు. ఆయన కులమతాలకు అతీతంగా హిందూ - ముస్లిముల మధ్య ఉన్న మత ద్వేషాలను నిర్మూలించి స్నేహబంధం పెంచి మన గుర్తింపు కేవలం భారతీయులం మతం కాదు అన్నట్లుగా ఉందని అదే ఉద్దేశమని చెబుతుంటారు. అప్పట్లో దేశ విభజన సమయంలో ప్రథమంగా పంజాబ్, బెంగాల్ లో పెద్ద ఎత్తున మతకలహాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం ఆ పరిస్థితిని  నియంత్రించలేని దుస్థితికి చేరుకుంది. అప్పట్లో ఆ భారం మొత్తం గాంధీజీ పైనే పడింది.

ప్రభుత్వం గాంధీజీ ఒక్కరే ఈ సమస్యను పరిష్కరించగలరని విశ్వసించి ఆయన వైపు చూసింది. 1947 లో గడిచిన రోజులవి...పాకిస్థాన్ కి భారత్ కి మధ్య మతకల్ల్లోలం రగులుతోంది. కలసి ఉండడం అస్సలు కుదరదు అని, భారత్ లో నివసిస్తున్న ముస్లింలు అందరూ తిరిగి పాకిస్థాన్ కు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. మరోవైపు విభజన సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కి 55 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అది ఇచ్చేందుకు భారత్ నిరాకరించింది. దాంతో పాకిస్థాన్ కి భారత్ పై మరింత ద్వేషం పెరిగింది. గాంధీజీ మాత్రం ఇందుకు ఏమాత్రం అంగీకరించలేదు. మాట తప్పడం మంచిది కాదు, ఇలా చేస్తే పాకిస్థాన్ కి భారత్ కి మధ్య అన్ని విధాలా శత్రుత్వం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అని ఆయన తన అభిప్రాయాన్ని వినిపించారట.

అంతేకాదు ఇదే అంశంపై ఢిల్లీలో గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు..ఇదే ఆయన చివరి ఉద్యమం అని చెప్పొచ్చు.  ఈ నిరాహార దీక్షకు మూల కారణం

* ఒకటి భారత ప్రభుత్వం పాకిస్థాన్ కి ఇస్తానన్న 55 కోట్లు ఇచ్చేయాలి.
*మత హింస ఆగాలి అని.

ప్రభుత్వం తరపు నుండి ఎందరు ఎన్ని విధాలుగా నిరాహార దీక్ష విరమించమని గాంధీకి నచ్చచెప్పినా ఆయన అస్సలు వినలేదు. చివరికి గాంధీజీ పట్టుదల ముందు ప్రభుత్వమే దిగి వచ్చింది. పాకిస్తాన్ కి 55 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అదే విధంగా భారత్ లో ముస్లిములు, సిక్కులు వంటి ఇతర మతస్థులు మనతో కలిసి ఉండటానికి అంగీకరించింది. దీని పరిణామాలు గాంధీజీకి శత్రువుల సంఖ్య మరింత పెరిగేలా చేశాయి. పాకిస్తాన్ లకు గాంధీజీ మద్దతుగా నిలుస్తున్నారని హిందూ వర్గంలో విద్వేషాలు మొదలయ్యాయి. అటు పాకిస్థాన్ లో ఏమో ముస్లిములకు అండగా నిలబడుతున్నట్టు కనబరచి మరేదో పన్నాగం జరుగుతుందని భావించారు. ఇలా అన్ని వైపులా గాంధీజీకి శత్రువర్గం పెరిగింది. ఆయన మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన అన్న చివరి మాటలు గుర్తుచేసుకుంటే పిల్లలు వీరెవరికీ ఇపుడు తెలియదు..అర్దం కాదు. కానీ నేను పోయాక నన్ను గుర్తు చేసుకుంటారు. ఆ ముసలాడు  చెప్పింది నిజమేనని..అని ఆయన చివరి రోజుల్లో అన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: