తెలుగుదేశం పార్టీ పని నిజంగానే అయిపోయిందా... చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మునిసిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరింది. దీంతో అంతా తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని అంటున్నారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అటు పార్లమెంట్ స్థానాల్లో కూడా కేవలం మూడంటే మూడే టీడీపీ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా వైసీపీ విజయ పరంపర కొనసాగింది. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుచుకున్నారు. అసలు కొన్ని మునిసిపాలిటీల్లో అయితే క్లీన్ స్వీప్. మాచర్ల మునిసిపాలిటీ మొత్తం ఏకగ్రీవమే. నెల్లూరులో 54 డివిజన్లు కూజా వైసీపీ ఖాతాలోనే చేరాయి. దీంతో అంతా ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకోవాల్సిందే అనేస్తున్నారు కూడా అధికార వైసీపీ నేతలు.

అయితే.. తాజాగా వచ్చిన ఫలితాలు మాత్రం అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా జరిగిన 12 మునిసిపాలిటీలలో, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 48% ఓట్లు వస్తే, టిడిపికి 40% వచ్చాయి. ఇప్పుడు ఇదే 12 మునిసిపాలిటీలలో వైసీపీ ఓట్ల శాతానికి భారీగా గండి పడింది. ప్రజా వ్యతిరేకతతో వైసీపీ దెబ్బతింది. వైఎస్ఆర్సీపీకి 45% ఓట్లు వస్తే, టిడిపికి 43% వచ్చాయి. గతంలో ఏకాగ్రీవాలతో వైసీపీ హడలెత్తించినా, ఇప్పుడు మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, 90 మునిసిపాలిటీల్లో, టిడిపి కేవలం ఒక్క మునిసిపాలిటీ మాత్రమే గెలిచింది. కానీ ఈసారి మాత్రం 12 మునిసిపాలిటీలలో దర్శి, కొండపల్లి మునిసిపాలిటీలను గెలుచుకుంది. జగ్గయ్యపేటలో దాదాపు గెలిచినంత పని చేసింది. ఇక దాచేపల్లి మొదట టిడిపి గెలించిందని ప్రకటించి, మళ్ళీ రెండు వార్డులు రీ కౌంటింగ్ చేసి, వైసీపీ గెలిచినట్టు చెప్పారు. బేతంచర్లలో అయితే... ఏకంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత వార్డును కూడా టీడీపీ గెలిచేసింది. గతంలో మొత్తం 90 పురపాలికల్లో దాదాపు 15 మునిసిపాలిటీల్లోకనీసం ఒక్క వార్డు కూడా గెలవలేదు. కానీ ఇప్పుడు మొత్తం 328 వార్డులకు ఎన్నికలు జరిగితే... దాదాపు 150 వార్డులు టీడీపీ గెలుచుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: