3 రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తున్న సంద‌ర్భం ఇది. ఎవ‌రు అవునన్నా కాద‌న్నా మంచి నిర్ణ‌యం ఇది అని కొంద‌రు, లేదండి ఇలాంటి నిర్ణ‌యాల అమ‌లు అనుకున్నంత సులువు కాద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. రాష్ట్రాన్ని గంద‌రగోళంలో నెట్టేశార‌ని తాజాగా మా శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఓ ప్ర‌క‌ట‌న కూడా  చేశారు. అంతేకాదు ఇలాంటి ప్ర‌క‌ట‌నల కార‌ణంగా అమ‌రావ‌తితో పాటు ఇత‌ర ప్రాంతాల అభివృద్ధి కూడా ఎక్క‌డికక్క‌డ నిలిచిపోతోంద‌ని కూడా ఆయ‌న ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌ధానిని ఆ రోజు చంద్ర‌బాబు ఒక ఫైనాన్షియ‌ల్ గ్రోత్ సెంట‌ర్ గానే చూశార‌ని, దీన్నొక వెంచ‌ర్ క్యాపిట‌ల్ గా చేయాల‌నుకున్నార‌ని, అందుకే పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌పైనే దృష్టి సారించారే త‌ప్ప మ‌రో ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఆయ‌న రాజ‌ధానిగా ఎంపిక చేయ‌లేద‌ని అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు. ఎవ‌రు ఎన్ని అనుకున్నా రాజ‌ధాని అమ‌రావ‌తినే అని ఆ..దిశ‌గా త‌మ‌తో పాటు పోరాటంలో ఆ రోజు నిధులు ఇచ్చిన కేంద్రం (బీజేపీ స‌ర్కారు) త‌ర‌ఫు మ‌నుషులు ఇవాళ త‌మ‌తోనే ఉన్నార‌ని అంటున్నారు.

ఇక ఆ రోజు 3 రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు(వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్, ఒక‌ప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్ర రెవెన్యూ మంత్రి, ఇప్ప‌టి శ్రీ‌కాకుళం శాసన స‌భ్యులు)  నేతృత్వంలో ఓ రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. వైసీపీ జిల్లా కార్యాల‌యం ప్రాంగ‌ణంలోనే ఈ స‌మావేశం నిర్వ‌హించారు. ఆ రోజు ధ‌ర్మాన రాజ‌ధానితో నాకేంటి ప‌ని మీకేంటి ప‌ని.. అదొక పెట్టుబ‌డిదారుల‌కు  స్వ‌ర్గ ధామం త‌ప్ప అని అమ‌రావ‌తిని ఉద్దేశించి అన్నారాయ‌న. బాగుంది అలాంటి పెట్టుబ‌డి దారులు వైసీపీ స‌ర్కారుకు అవ‌స‌రం లేదా? లేకా పెట్టుబ‌డి దారుల‌ను చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ త‌క్కువ మోతాదులో ఆక‌ర్షిస్తున్నారా? లేదా బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ గా ఏపీనీ సంబంధిత వ‌ర్గాల‌నీ త‌యారు చేయ‌లేక‌పోతున్నారా?అయినా ఓ బాధ్య‌త గ‌ల ఎమ్మెల్యే రాజ‌ధానితో నాకేంటి సంబంధం అని చెప్ప‌డం ఏంటి? ఆరోజు అమ‌రావ‌తే రాజ‌ధాని అని చెప్పిన‌ప్పుడు లేదా అసెంబ్లీ వేదిక‌గా బాబు స‌ర్కారు ప్రక‌టించిన‌ప్పుడు వైసీపీ నుంచి ఎటువంటి అభ్యంత‌రాలూ రాలేదే..క‌నీసం పాద‌యాత్ర‌లో కూడా జ‌గ‌న్ త‌ర‌ఫు అభ్యంత‌రాలేవీ వినిపించ‌నూలేదే! అంటే ఇప్ప‌టికిప్పుడు న‌డిపిస్తున్న నాటకంలో అమ‌రావ‌తి పూర్తిగా నామ రూపాలు లేకుండా చేయాల‌న్న‌దే వైసీపీ ధ్యేయం అని అనుకోవాలా లేదా వైసీపీ ప్రేమ విశాఖ పైనే ఉంద‌ని అనుకోవాలా అని ప్ర‌శ్నిస్తోంది ప్ర‌ధాన విప‌క్షం. మ‌రోవైపు విశాఖ కేంద్రంగా లెక్క‌కు మించి అద్దెలు చెల్లించి స‌చివాల‌యం త‌ర‌లించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కూడా మ‌రో ప్ర‌శ్న అదే విప‌క్ష పార్టీ అయిన టీడీపీ నుంచి వినిపిస్తోంది. వీటిపై బాధ్య‌త గల వైసీపీ స‌ర్కారు మాట్లాడాలి. అంతేకానీ బాధ్య‌తారాహిత్యంతో స‌మాధానాలు ఇవ్వ‌కూడ‌దు. ఎటువంటి ఆందోళ‌న‌ల‌కూ గంద‌ర‌గోళాల‌కూ తావివ్వ కూడదు.
మరింత సమాచారం తెలుసుకోండి: