తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తలు అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. 2018 లో జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బంపర్ మెజారిటీతో విజయం సాధించి వరుసగా రెండోసారి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అయితే ఈ వ్యతిరేకత మరింత పెరగకుండా ఉండేందుకు ఈ ఏడాది ముందుగానే ఆయన ఎన్నికలకు వెళ్ళిపోతారు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల తనను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా ఉంటాయని... అందుకు తగినట్టుగా మీరు సిద్ధంగా ఉండాలని కూడా సంకేతాలు ఇచ్చారు.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని... మీరు పోరాటం చేయాలని తెలంగాణ బిజెపి నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని కూడా రాష్ట్ర నేతలతో ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తన స్పెషల్ టీం కూడా తెలంగాణకు పంపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఏ యే నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ గెలుస్తుంది అన్న విషయాలతో కూడిన నివేదికను నిర్వహించనుంది.

వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న‌ మంత్రి హరీష్ రావు , మరో మంత్రి అయిన కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు చెక్ పెట్టేలా ప్రత్యేకంగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వ‌రి కొనుగోలు వ్యవహారంలో అనుసరిస్తున్న విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి టిఆర్ఎస్ ను వీక్‌ చేయాలని కూడా తెలంగాణ బిజెపి నేతలకు షా సూచించారు.

40 నియోజకవర్గాల్లో బిజెపికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ... కొంచెం కష్టపడితే పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా తెలంగాణ బిజెపి నేతలతో షా అన్నట్టు తెలిసింది. ఏదేమైనా ఈసారి బిజెపి తెలంగాణలో గెలిచేందుకు సకల ప్రయత్నాలు చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: