క‌రోనా వైర‌స్ ప‌లు వేరియంట్ల రూపంలో ప్ర‌పంచంపై మ‌రోసారి విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. అస‌లు క‌రోనా ఆవిర్భావానికి కార‌ణంగా ఇత‌ర దేశాలు న‌మ్ముతున్న చైనాలో మొద‌టి వేవ్ విల‌యం సృష్టించినా రెండోవేవ్ ను మాత్రం ఆ దేశం స‌మ‌ర్థంగానే నిలువ‌రించ‌గ‌లిగింది. అయితే ఇప్పుడు మూడో వేవ్ మాత్రం ఆ దేశాన్ని కూడా భ‌య‌పెడుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా నిత్యం వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు వ‌స్తుండ‌టంతో నియంత్రించేందుకు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. బీజేపీలో వింట‌ర్ ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో వైర‌స్ ముప్పు విస్త‌రిస్తుండ‌టం ఆ దేశానికి గుబులు పుట్టిస్తోంది. జీరో కోవిడ్ వ్యూహంతో ముందుకు వెళుతున్న చైనా ప్ర‌భుత్వం కోవిడ్ కేసులు క‌నిపించిన న‌గ‌రాల్లో క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తోంది.
 
ఇప్ప‌టికే ఆ దేశంలో లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు అమ‌లవుతున్న షియాన్‌, టియాంజిన్‌ల స‌ర‌స‌న తాజాగా సెంట్ర‌ల్ హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన అన్యాన్‌ న‌గ‌రం కూడా చేరింది. 55 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నాభా క‌లిగిన ఈ న‌గ‌రంలో84 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూసిన‌ట్టు తెలుస్తోంది. వీరినుంచి ఇంకా ఎవ‌రికి వ్యాప్తి చెందిందో తెలుసుకునేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ , కోవిడ్ టెస్టులు నిర్వ‌హించేందుకుగాను మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప‌ర్యాట‌క కేంద్రాలుగా పేరొందిన షియాన్‌, టియాంజిన్‌లో కూడా ప్ర‌జ‌లంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.చైనాలో మంగ‌ళ‌వారం 200 కేసులు కొత్త‌గా బ‌య‌ట‌ప‌డిన‌ట్టు అక్క‌డి జాతీయ వైద్య సంస్థ తెలిపింది. 3,458 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నార‌ని, వీరిలో 21మంది ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని ప్ర‌భుత్వ వైద్యాధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితం మొట్ట‌మొద‌టి కోవిడ్ కేసు వెలుగు చూసిన నాటినుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 4,636 మంది చ‌నిపోయిన‌ట్టు అధికారులు చెపుతుండ‌గా వాస్త‌వ సంఖ్య అంత‌కు ఎన్నో రెట్లు ఉంటుంద‌ని, అక్క‌డి ప్ర‌భుత్వం నిజాలు దాస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌  చైనాలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ గురించి అక్క‌డి ప్ర‌భుత్వం ఘ‌నంగా చెప్పుకున్నా ఆ దేశంలో త‌యారైన వ్యాక్సిన్ల స‌మ‌ర్థ‌త‌పై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: