
కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు పార్టీ వీడుతుండడం కమలానికి కలవర పెడుతోంది. మరోవైపు స్వాగతం అంటూ సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ నేతలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. యూపీలో క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరారు. తూర్పు యూపీలో బలంగా ఉన్న ఓబీసీ నేత దారా సింగ్ యోగి క్యాబినెట్లో పర్యావరణ, అటవీ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2015 లో బీఎస్పీ నుంచి బయటకు వచ్చి కాషయా కండువా కప్పుకున్న దారాసింగ్ ఇప్పుడు బీజేపీని వీడారు.
అంతకుముందు స్వామి ప్రసాద్ కమలం పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ మునిగిపోయే నావ అని మరింత మంది కాషాయ పార్టీని వీడుతారని బాంబ్ పేల్చారు. యోగీ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పని చేసినా మౌర్య.. తన రాజీనామా అనంతరం యూపీ బీజేపీలో తుఫాన్ వస్తుందన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ దారిలోనే పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు. మరికొంత మంది మినిస్టర్లు కూడా కాషాయ పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది.