పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలు పెట్టబోతున్నారు. దసరా నుంచి ఆయన తన యాత్ర ప్రారంభిస్తారు. తిరుపతి నుంచి రాజకీయ పర్యటన మొదలు పెట్టేందుకు షెడ్యూల్ ఖరారైంది. దీనికోసం 8వాహనాల కాన్వాయ్ కూడా రెడీ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కల్యాణ్, సీఎం లాగా బిల్డప్ ఇస్తున్నారని, కాన్వాయ్ ని రెడీ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. వైసీపీకి చెందిన కొంతమంది ఇలా ట్రోల్ చేస్తున్నారంటూ జనసైనికులు మండిపడుతున్నారు.

జనసైనికుల కౌంటర్..
వైసీపీ నుంచి కొంతమంది పవన్ కల్యాణ్ కాన్వాయ్ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడంతో, ఇటు జనసైనికులు కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ కార్లు సిద్ధం చేసుకుంటే మీకెందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్ పర్యటన చేశారు కదా, అప్పుడు కార్లు పెట్టలేదా, ప్రజల్లోకి వెళ్లలేదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద పవన్ పర్యటనకు ముందే కావాల్సిన ప్రచారం లభించింది.

కొత్త కార్ల విషయానికొస్తే..
8 కొత్తకార్లను దాదాపు కోటిన్నర రూపాయల ఖర్చు చేసి కొన్నారని తెలుస్తోంది. కార్లతోపాటు పవన్ కాన్వాయ్ లో ఓ కారవాన్ కూడా ఉంటుంది. ఇది కూడా యాత్ర పొడవునా పవన్ కాన్వాయ్ లో తిరుగుతుంది. ఇక పవన్ ఎక్కడ ఏ జిల్లాలో బస చేస్తారు, ఎక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అనేది కూడా ముందే డిసైడ్ అయింది. అప్పటికప్పుడు స్థానికుల అభ్యర్థన, ఏర్పాట్ల ప్రకారం కూడా అక్కడే పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఆరు నెలలపాటు ఏకధాటిగా పవన్ కల్యాణ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఓ సభ ఉండేట్లు ప్రణాళిక సిద్ధమైంది. దీంతోపాటు ప్రతి సామాజిక వర్గానికి సంబంధించిన వారితో, ఆయా వర్గాలతో పవన్ ప్రత్యేకంగా భేటి కాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. దాదాపుగా ఈ టూర్ లో పవన్ కల్యాణ్.. పొత్తుల విషయంపై కూడా క్లారిటీ ఇస్తారని అంటున్నారు. టూర్ కి ముందే పొత్తులు ఖరారైతే.. టూర్ లో పవన్ కల్యాణ్ అభ్యర్థులను కూడా ఎంపిక చేసే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: