దేశ‌వ్యాప్తంగా ఇప్పుడంతా క‌రోనా గురించే చ‌ర్చ‌. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జ‌రిగిన‌ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల గురించే ఆందోళ‌న‌. ఇలాంటి త‌రుణంలో ఆ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారిలో మెజార్టీ వారు క‌రోనా పాజిటివ్‌లుగా తేలుతుండ‌టం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. అయితే, ఈ ప‌ర్వంపై తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ, క‌రోనాపై కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్‌గా ఉంద‌ని తెలిపారు. 

 


ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ దేశానికి చౌకీదార్‌ అని పేర్కొన్న కిష‌న్ రెడ్డి క‌రోనా విష‌యంలో మొద‌టి  నుంచి ఇప్పటి వరకు ప్రజలను చైతన్యం చేస్తూ, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారని అన్నారు. హిందువుల పండుగ అయిన హోలీ ఆడవ‌ద్దని ప్రధాని పిలుపు నిచ్చారని గుర్తు చేశారు. అలా అనేక నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్లే పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత అందరి అభిప్రాయం మేరకు కరోనా నుంచి దేశ ప్రజల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. లాక్‌‌‌‌డౌన్‌ ఏ రకంగా ఉంటుంది అనేది ఆయన నేరుగా ప్రకటిస్తారని కిష‌న్ రెడ్డి తెలిపారు. 

 

దేశంలో ప్ర‌స్తుం క‌రోనా ప‌రిస్థితి గురించి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి వివ‌రిస్తూ...మర్కజ్ వెళ్లివ‌చ్చిన వారి వ‌ల్ల పెరుగుతున్న‌ కరోనా కేసులు లేకుంటే దేశంలో లాక్‌‌డౌన్‌ ‌పొడిగింపు అంశమే తలెత్తేది కాదని అన్నారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వాళ్లు చాలా మంది సమాచారం ఇవ్వడం లేదని, వాళ్లంతా సమాచారం ఇవ్వాలని కిష‌న్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల ద్వారా అలాంటి వారిని పట్టుకుంటున్నారని తెలిపారు. ఇది ఏ ఒక్కరికో వ్యతిరేకం కాదు. మర్కజ్‌‌‌‌కు వెళ్లొచ్చిన మన దేశం వారిపై ఏ రకమైన కేసులు పెట్టడం లేదని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌ టూరిస్ట్‌‌‌‌ వీసా మీద వచ్చి మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం కాబ‌ట్టి అలాంటి వాళ్లపైనే కేసులు పెడుతున్నామ‌న్నారు.  మ‌ర్కజ్‌‌‌‌కు వెళ్లిన వారి ఆరోగ్యం కోసమే సమాచారం ఇవ్వాలని కోరుతున్నామ‌న్నారు కిష‌న్ రెడ్డి. మర్కజ్‌‌ వెళ్లొచ్చిన వాళ్ల వివరాలు చెప్తే క్యాష్ బహుమతులు ఇస్తామని ప్రకటించామ‌ని ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: