క‌లియుగ దైవం శ్రీ వెంక‌టేశ్వ‌రుడు కొలువుదీరిన తిరుమ‌ల నుంచి భ‌క్తులకు, సామాన్యుల‌కు మ‌రో తీపిక‌బురు అందింది. కరోనాను అరికట్టేందుకు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఆయా ప్రభుత్వాలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. కరోనాపై పోరుకు టీటీడీ కూడా భారీ విరాళం ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున రూ. 19 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నట్టు ttd ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు.

 

లాక్ డౌన్ నేపథ్యంలో వ‌ల‌స కూలీలు, పేద ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తుండ‌డం చూసి, వారిని ఆదుకునేందుకు, వారంతా ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని, వారి ఆకలి తీర్చేందుకు జిల్లాకు రూ. కోటి చొప్పున రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.13 కోట్ల విరాళాన్ని అందించ‌నుంది. ఈ మేర‌కు ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందజేసేలా నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. బుధ‌వారం టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ సమీక్షలో అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు రూ. కోటి చొప్పున విరాళ‌మివ్వాల‌ని నిర్ణ‌యించారు. అలాగే లాక్‌డౌన్ గడువును పొడిగించడంతో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మే 3వ తేదీ వరకు నిలిపివేసినట్లు సింఘాల్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఏప్రిల్ 14వరకూ శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. ఈ నిలిపివేతను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు వివ‌రించారు. భక్తుల్ని దర్శనానికి అనుమతించకపోయినా.. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపింది.

 


కాగా, టీటీడీ  ఇదివ‌ర‌కే ప‌లు సంద‌ర్భాల్లో స‌హాయం చేసింది. ఇప్పటికే మొదటి విడతగా చిత్తూరు జిల్లా అధికారులకు రూ. 8 కోట్లు ఇచ్చారు. మిగితా రూ. 11 కోట్లను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి బదిలీ చేశారు. లాక్‌డౌన్ కారణంగా నిరాశ్రయులు అయిన వారికి ఆహారం అందిస్తున్నారు. ప్రతి రోజు యాచకులు,కూలీలు, పేద వారి కోసం ప్రత్యేకంగా లక్షా 20 వేల ఆహారపు ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నది టీటీడీ. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకూ తమ వంతు సాయం చేస్తూనే ఉంటామని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: