విద్యార్ధుల భవిష్యత్తుకు శరాఘాతం జీవో నెం.77 అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి అని డిమాండ్ చేసారు. తమ హక్కులు, సమస్యలపై నిరసన తెలియజేసే హక్కు ప్రతి విద్యార్ధికి ఉంటుంది అని ఆయన అన్నారు. ఆ హక్కును కూడా కాలరాసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. జీవో నెం.77ను ఉపసంహరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి ఇప్పటి వరకు విడిచిపెట్టకుండా వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు ఆయన.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.77 విద్యార్ధుల జీవితాలకు శరాఘాతంగా మారుతోంది అని వ్యాఖ్యలు చేసారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటూ ఊదరగొట్టిన జగన్ రెడ్డి.. నేడు పీజీ విద్యార్ధులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సదుపాయాలన్నింటినీ నిలిపివేస్తూ ఏకంగా ఉత్తర్వులు తీసుకురావడం అత్యంత దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేసారు.  ప్రచార ఆర్భాటం తప్ప.. విద్యార్ధులకు న్యాయం చేద్దామనే ఆలోచన ఏ కోశానా లేదని జీవో నెం.77 జారీతో స్పష్టమైంది అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, పేద విద్యార్ధులకు ఉన్నత విద్యను దూరం చేసేలా జీవో తెచ్చారు అని ఆయన ఆరోపించారు.

టీడీపీ హాయంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి ఏదో ఉద్దరించేస్తున్నట్లు హడావుడి చేస్తూ.. విద్యార్ధుల హక్కు అయినటువంటి స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ నిలిపివేస్తారా.? అని ప్రశ్నించారు.  ఇదేనా విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.? తమ హక్కుల కోసం పోరాడిన విద్యార్ధులపై ప్రభుత్వం లాఠీలు ఝుళిపించడం, ప్రశ్నించిన వారిని కేసులతో వేధించడం హేయం అని మండిపడ్డారు. స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ ను నమ్ముకుని చదువుకుంటున్న పేద విద్యార్థుల పాలిట జీవో నెం.77 ఉరితాడు లాంటిది అని అన్నారు. అలాంటి జీవో ఇవ్వడమే పెద్ద మోసం అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: