జగన్ సర్కారు మరో తేనెతుట్టెను కదిపిందా.. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం ద్వారా మరో వివాదానికి తెర తీసిందా అంటే.. అవుననే సమాధానం వస్తుంది.. రాష్ట్ర అవతరణ అనేది రాష్ట్రానికి సంబంధించిన  సెంటిమెంట్. ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని వర్గాలనూ సంప్రదించి.. చర్చించాక తీసుకుంటే వివాదాలకు తావు లేకుండా ఉంటుంది. అందులోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. అందుకే గత ప్రభుత్వం ఈ గొడవంతా ఎందుకని అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవమే నిర్వహించడం మానేసింది.

ఇప్పుడు జగన్ సర్కారు నవంబర్ 1ను రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్ణయించింది. ఇప్పుడు దీనిపైనా వివాదం మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. నవంబర్ ఒకటి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తేదీ.. కానీ.. అసలు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఉనికిలో లేదు. అలాంటప్పుడు నవంబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం సబబేనా అన్న చర్చకు అవకాశం లభిస్తుంది.

ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే.. 1953 ముందు వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు.. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటికి తెలంగాణ హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉండేది. అందులో ఇప్పటి కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలనే డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ స్టేట్‌లోని తెలంగాణను.. ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా నవంబర్ 1, 1956న తెలంగాణతో కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

ఇప్పుడు తెలంగాణ విడిపోయినందువల్ల నవంబర్ 1న అవతరణోత్సవం జరపడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. తెలంగాణ నుంచి విడిపోయిన ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ దాదాపు 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి అక్టోబర్ 1న జరపాలా అన్నది చర్చకు దారి తీయొచ్చు. మరి జగన్ సర్కారుపై విపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: