వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలోని పేదలకు కట్టించే ఇళ్ల నమూనాని ఈపాటికే సిద్ధం చేసింది ప్రభుత్వం. అయితే ఈ నమూనాకి అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్దంగా ఉండాలని అధికారులు ఇంజినీరింగ్ విభాగం  సిబ్బందికి తెలియజేశారు. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులతో ఉన్నత స్థాయి సెమినార్ జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట నున్న గృహ నిర్మాణాల్లో ఎక్కడా లోపాలు ఉండరాదని, నాణ్యంగా ఉండాలని ఇంజనీరింగ్‌ సిబ్బందిని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించే ఇంజనీరింగ్‌ సిబ్బందితో తాడేపల్లిలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో సెమినార్‌ నిర్వహించారు. ఇళ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ నెల 26న సెమినార్‌ నిర్వహించబోతున్నట్టు అధికారులు తెలిపారు.

నవరత్నాల అమలులో భాగంగా పేదలకు ఇళ్లపట్టాల పంపిణీతోపాటు, గృహనిర్మాణ పథకాన్ని కూడా డిసెంబర్‌ 25న లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని, అదే రోజు నమూనా ఇళ్ల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, అందరికీ ఒకే విధంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు. వైఎస్ఆర్ హౌసింగ్ పేరుతో అందరికీ నాణ్యమైన ఇళ్లను అందించాలని నిర్ణయించారు.

ఈ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించే సమయానికి లబ్ధిదారునికి గృహం మంజూరు పత్రంతోపాటు సీఎం సందేశం,  పూర్తి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు ఇంజినీరింగ్ సిబ్బందికి సెమినార్‌లో సూచించారు. డిసెంబర్‌ 25న సీఎం జగన్‌ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్, మెటల్, ఇసుక తదితరాలను లేఅవుట్ల సమీపంలోని గోడౌన్లలో భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య మంత్రి ఆదేశాల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, అన్ని వివరాలను, పనుల పురోగతిని, ఎప్పటికప్పుడు డ్యాష్‌ బోర్డులో పొందు పరచాలని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: