డీజీపీ వ్యవహారం ఏంటో చూస్తానంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అరెస్టు, విడుదల వ్యవహారం, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, డీజీపీ వైఖరి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై ప్రభుత్వం కక్షసాధింపు వంటి అంశాలపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన జరుగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటని డీజీపీని ప్రశ్నించారు. రామతీర్థానికి రెండో తారీఖున తాను వెళ్లిన తర్వాతే ప్రభుత్వం కదిలిందనీ, లా అండ్ ఆర్డర్ పై తనకు బాధ్యత లేదన్నట్టుగా డీజీపీ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రాముడి విగ్రహం తల నరికితే నేను ప్రశ్నించడం తప్పా? అని చంద్రబాబు నిలదీశారు. ఏపీలో అమలవుతున్నది ఇండియన్ పీనల్ కోడ్ నా? లేదా జగన్ పీనల్ కోడ్ నా? అని చంద్రబాబు మండిపడ్డారు.
                                                    కళా వెంకట్రావు వివాద రహితుడని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేసి ఇబ్బంది పెడతారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘ధర్మ పరిరక్షణ కార్యక్రమం మేము చెయ్యకూడదా? మమ్మల్ని అందర్నీ జైల్లో పెట్టండి? ప్రజలు అందర్నీ కూడా జైల్లో పెట్టండి. డీజీపీ సమాధానం చెప్పాలి? ఏం తమాషా చేస్తున్నారా? రామ తీర్థం వెళ్ళినప్పుడు నన్ను అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. కళా వెంకట్రావుని అరెస్ట్ చేసిన విధానం, కేసు పెట్టిన విధానం సరికాదు. డీజీపీ తప్ప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. రాముడి విగ్రహం తల నరికితే కోపం రాదా.? నా కాన్వాయ్ పై రైతులు చెప్పులు విసిరారు అని అంటున్నారు. చెప్పులు విసిరేంత కోపం నాపైన రైతులకు లేదు. రౌడీ మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక సీఎం, ఒక డీజీపీ, ఒక హోం మంత్రి ఒకే మతం వాళ్లు అయి ఉంటే ఏం జరుగుతుందో నిరూపించార’’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండని చంద్రబాబు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: