ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాల పంతాలతో ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశం తీవ్ర వివాదమైంది. ఎత్తులు, పై ఎత్తులతో వేడెక్కింది. కోర్టుల్లోనూ రెండు వర్గాల మధ్య పోరాటం జరిగింది. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికలు అపేందుకు అన్ని దారులు మూసుకుపోవడంతో జగనోరి సర్కార్ కూడా ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలకు సిద్దమైంది. ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ దశలో మరోసారి పంచాయతీ ఎన్నికల అంశం హైకోర్టుకు వెళ్లింది. దీనిపై గురువారం విచారణ జరగనుంది. దీంతో ఏపీ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నదానిపై మళ్లీ చర్చలు జరుగుతున్నాయి.
 
               ఎస్ఈసీ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల తరఫున న్యాయవాది శివప్రసాదరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 2019 నాటి ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరపడం సరికాదని, 2021 ఎన్నికల జాబితాతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో ఆయన విజ్ఞప్తి చేశారు. 2019 నాటి జాబితాతో 3.60 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం శుక్రవారం విచారణ జరుపుతామని వెల్లడించింది. అయితే శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని న్యాయవాది శివప్రసాదరెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో గురువారమే విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది.

        ప్రతి సంవత్సరం జనవరిలో ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితా వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది కొత్త ఓటర్ల జాబితా సిద్ధం కాలేదు. ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వమే ఇలా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఇదే విషయం చెప్పారు. విధి లేని పరిస్థితుల్లోనే 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరపాల్సి వస్తుందని చెప్పారు. ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యం వహించారంటూ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సీనియర్ అధికారి గిరిజా శంకర్ పై చర్యలకు ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా పైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ఆసక్తిగా మారింది.

     

మరింత సమాచారం తెలుసుకోండి: