బెదిరించారు.. భ‌య‌పెట్టారు.. ప్ర‌లోభాల ఎర వేశారు.. సామ‌, దాన‌, భేద‌, దండోపాయాల‌న్నింటినీ ప్ర‌యోగించారు. ఎలాగైతేనేం
రెండు పుర‌పాల‌క సంఘాల‌ను కైవ‌సం చేసుకోగ‌లిగారు. కానీ అక్క‌డ మాత్రం అధికార పార్టీ అరాచ‌కం ప‌నిచేయ‌లేదు. ఎత్తులు ఫ‌లించ‌లేదు. దౌర్జ‌న్యాలు మాత్ర‌మే అల‌వాటైన అధికార ప‌క్షం వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ర‌చించ‌డంలో వెన‌క‌బ‌డింది. ఏం చేయాలో ఆ పార్టీ నేత‌ల‌కు కూడా అర్థంకాలేదు. ఈలోగా నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ప‌ర్వం ముగిసిపోయింది. అబ్య‌ర్థులు గిరి గీసి బ‌రిలో నిల‌బ‌డ్డారు. ఇక్క‌డి తెలుగుదేశం పార్టీ నేత త‌న ప‌ట్టు నిరూపించుకున్నారు.

నెల్లూరు జిల్లాలో నాయుడుపేట‌, సూళ్లూరుపేట పుర‌పాల‌క సంఘాల‌ను అధికార పార్టీ ఏక‌గ్రీవం చేసుకోగ‌లిగింది. కానీ వెంక‌ట‌గిరికి వ‌చ్చేస‌రికి మాత్రం వారి వ్యూహాలు చిత్త‌య్యాయి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వ్యూహాత్మకంగా క్యాంప్‌ నిర్వహించి అధికార పార్టీ అక్రమాలకు అస్కారం లేకుండా అడ్డుకోగలిగారు. వెంకటగిరిలో మున్సిపల్‌ వార్డులను ఏకగ్రీవం చేసుకునే క్రమంలో అధికార పార్టీ అరాచ‌కాల‌కు అంతే ఉండ‌ద‌ని గ్ర‌హించిన కురుగుండ్ల క్యాంపు రాజకీయాలు నిర్వహించారు. అభ్యర్థులు అందుబాటులో ఉంటే వారిని రకరకాల భయాలకు, ప్రలోభాలకు గురిచేస్తారన్న ఉద్దేశంతో వారం రోజుల ముందే వీరందరిని చెన్నైలోని అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.

అభ్య‌ర్థుల శిబిరంలో తాను కూడా ఉంటూ వెంక‌ట‌గిరిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కురుగుండ్ల ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోగ‌లిగారు. దీంతో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ఆయ‌న‌కు అవ‌కాశం ల‌భించింది. తన వెంట ఉన్న అభ్యర్థులకు అధికార పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోగ‌లిగారు. ఏయే వార్డుకు ఎవ‌రెవ‌రు నిల‌బ‌డ్డారు? ప‌్ర‌చారంలో ఎవ‌రెవ‌రి బ‌లాబ‌లాలు ఎంత‌? బ‌ల‌హీన‌త‌లేంటి? ఏర‌క‌మైన ప్ర‌చారంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌గ‌లం లాంటివ‌న్నీ అంచ‌నా వేసుకున్నారు. 25 వార్డులున్న మున్సిపాలిటీలో కేవలం మూడింటినే వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. మిగిలిన 22 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో వెంకటగిరి పుర‌పాల‌క సంఘ‌ ఎన్నికలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. రోజురోజుకూ ప్ర‌జ‌ల్లో ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: