తెలంగాణ ప్ర‌భుత్వం రెండేళ్ల క్రితం తీసుకువ‌చ్చిన కొత్త‌ మునిసిప‌ల్ చ‌ట్టం పురుషుల‌కు అన్యాయం చేస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. తెలంగాణ మునిసిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం.. 50శాతం స్థానాలను ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయిస్తోంది. ఇందులో అన్ని కేటగిరీల్లోను సగం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నారు.  చైర్మన్, మేయర్‌ స్థానాల రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా మేయర్‌ స్థానాల్లో సగం సీట్లను వివిధ కేటగిరీలకు రిజర్వ్‌ చేస్తారు. అయితే వాస్త‌విక ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే పుర‌పాలిక‌ల్లో, కార్పోరేట‌ర్ల‌లో మ‌హిళ‌ల సంఖ్య పెర‌గ‌డంతో పాటు మేయ‌ర్‌, మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్థానాల్లోకి కూడా వారే చేరుకుంటున్నారు.


మొత్తం రిజ‌ర్వేష‌న్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా స‌గం సీట్లు మ‌హిళ‌ల‌కే కేటాయించాల్సి రావ‌డం, మిగ‌తా జ‌న‌ర‌ల్ స్థానాల్లో నుంచి బ‌రిలో ఉండి గెలుస్తుండ‌టంతో మునిసిపాలిటీల్లో మ‌హిళా నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. ప్రాధాన్యం ఉన్న ప‌ద‌వులు కూడా వారికే ద‌క్కుతున్నాయి. దీంతో కొత్త మునిసిప‌ల్ చ‌ట్టం రాజ‌కీయంగా మ‌హిళ‌లు రాణించేలా చేస్తున్నా... పురుషుల‌కు మాత్రం కాస్త అన్యాయ‌మే జ‌రుగుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీంతో మునిసిపాలిటీల్లో మ‌హిళ‌లే మ‌హ‌రాణులుగా వెలుగొందుతున్నారు.ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పోరేషన్ , మునిసిపల్ ఎన్నికల తర్వాత వాటి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లుగా మహిళలకు సీఎం కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వం, ఎక్కడా వేయని విధంగా పెద్ద పీట వేశార‌నే చెప్పాలి.


మేయ‌ర్‌, మునిసిప‌ల్ చైర్మ‌న్ స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్ బీసీ జ‌న‌ర‌ల్ అయినా.. జ‌న‌ర‌ల్ అయినా అధికారం చేజిక్కించుకుంటున్న టీఆర్ ఎస్ పార్టీ మ‌హిళ‌ల‌నే ఆ స్థానాల్లో కూర్చోబెడుతుండ‌టం గ‌మ‌నార్హం. జీహెచ్ ఎంసీలో అలానే చేసింది. తాజాగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గా శ్రీమతి గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్  స్థానాల‌కు రిజ్వానా షమీమ్ మసూద్ లను ఎంపిక చేసి ఎన్నిక నిర్వ‌హించారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజా, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రాలు ఎన్నిక‌య్యేలా చేశారు. సిద్దిపేట చైర్ పర్సన్ గా కడవేర్గు మంజుల, కొత్తూరు మునిసిపల్ చైర్ పర్సన్ గా బత్తుల లావణ్య యాదవ్, జడ్చర్ల చైర్ పర్సన్ గా దొరిపల్లి లక్ష్మీ, నకిరేకల్ మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ ఉమారాణి, అచ్చంపేట వైస్ చైర్ పర్సన్ శైలజా విష్ణువర్ధన్ రెడ్డిల‌ను ఎన్నికయ్యేలా చూడ‌టం టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిద‌ర్శ‌నం.


మరింత సమాచారం తెలుసుకోండి: