ఏపీలో రాజకీయం ఎపుడూ కాక మీదనే ఉంటుంది అన్నది తెలిసిందే. నాడు చంద్రబాబు అధికారంలో ఉంటే జగన్ నిరసనల్తో హీటెక్కించేవారు. ఇపుడు చంద్రబాబు వంతు. మధ్యలో కరోనా అడ్డువచ్చింది కానీ ఈ పాటికే ఏపీలో రాజకీయం జోరందుకునేది.

ఇపుడు ఆ పనిలో టీడీపీ బిజీగా ఉంది. టీడీపీ అధినేత గత రెండేళ్ళలో చాలా టూర్లు వేశారు. అయితే వాటిలో ఎక్కువ మాత్రం వైసీపీ సర్కార్ అరెస్ట్ చేసిన నాయకులను పరామర్శించడానికే అన్నది తెలుస్తోంది. ఇక చంద్రబాబు మరో వైపు జిల్లాల టూర్లు వేసింది కూడా అమరావతి రాజధాని కోసం. ఇలా సొంత పార్టీ నాయకుల మీద అరెస్టులు అంటూ పోరు చేయడంతో పాటు అమరావతి కోసం బాబు ఇప్పటిదాకా జనంలోకి వచ్చారు. అయితే ఏపీలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య ఉంది. అది తాజాగా ఉంది. ఏ క్షణాన్నైనా కేంద్రం ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తుంది అన్న టాక్ ఉంది.

దాని మీద బాబు ఒకసారి విశాఖ టూర్ వేశారు. ఆ తరువాత ఆ సమస్య ఎందుకో టచ్ చేసింది లేదు అన్న విమర్శ ఉంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు కేంద్రం నెరవేర్చడంలేదు, మరో వైపు పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీని కొడుతున్నాయి. కరోనా అనంతర పరిస్థితులలో దేశంలో ద్రవ్యోల్బనం దారుణంగా పెరిగిపోయింది. ఉద్యోగాలు లేక జనాలు అల్లాడుతున్నారు. వీటిలో చాలా సమస్యలు దేశానికి సంబంధించినవి ఉన్నాయి. కానీ చంద్రబాబు టీడీపీ  నేతలు జగన్ మీదనే తమ గన్ వాడుతున్నారు. తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోని వస్తామని పదే పదే చెబుతున్నారు. మరి ఈ సమస్యల మీద పోరు చేయకుండా ఎలా పవర్ సొంతం అవుతుంది అన్నది ఆలోచించాలి కదా. మరో వైపు చూస్తే దేశ రాజకీయాలు మారుతున్నాయి. వాటి మీద టీడీపీ స్టాండ్ కూడా ఏంటో తెలియడంలేదు. ఒక విధంగా ఇవన్నీ తేలకుండానే తాము అధికారంలోనికి వస్తున్నాము అంటే క్యాడర్ కి ధైర్యం చెప్పడానికి అనుకోవాలి. లేదా ఒకసారి వైసీపీకి చాన్స్ ఇచ్చారు కాబట్టి మరోసారి తమకు ఇస్తారు అన్న ఆశ అయినా ఉండాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: