మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ గురించి బెంగ పట్టుకుంది. బిజెపి పాలిత రాష్ట్రమై ఉండి కూడా ఇక్కడ సీఎంగా,  భూపేంద్ర పటేల్ నీ నియమించి నాలుగు రోజులైనా.. మంత్రివర్గ విస్తరణ మాత్రం కొలిక్కి రాలేదు. హడావుడిగా నేడు 27 కొత్త మంత్రులతో క్యాబినెట్ ఏర్పాటు చేయాలని హైకమాండ్ ఆదేశించినా.. రూపాని  క్యాబినెట్ లో ఉన్న మంత్రులను పక్కన పెట్టడంతో, బిజెపిలో ముసలం పుట్టింది. సామాజిక సమీకరణలు ఉన్నాయంటూ కొత్త సీఎం చెబుతున్నా, కీలకమైన వర్గాలను,  సీనియర్లను కాదన్న తీరు అధికార పార్టీ బిజెపి లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. గత ఆరు నెలల్లో బిజెపి దించిన ముఖ్యమంత్రిగా నాలుగో నేత విజయ్ రూపాని. గుజరాత్ ఎన్నికలకు కేవలం 15 నెలల ముందు హైకమాండ్ ఆదేశాలతో గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్, కర్ణాటక,  గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల్లో ఆరు నెలల్లో మార్చబడిన నాలుగో సీఎంగా రూపానీ పై బిజెపి బ్లాక్ లైన్ గీసింది. పదవి నుంచి బరబరా దించేసింది.

అంతకుముందు సీఎంగా ఉన్న ఆనందిబెన్ ను దించేసి మాస్ లీడర్ కాకపోయినా రూపాని నీ తెచ్చి మోడీ, అమిత్ షా ద్వయం కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు అతను పనికిరాడంటూ భూపేంద్ర పటేల్ కు పట్టం కట్టారు. దీనిపై పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దీనికితోడు పాత క్యాబినెట్ ను పక్కన పెట్టాలని మోడీ,  అమిత్ షా ల వ్యూహం బెడిసికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్ నూతన క్యాబినెట్ బుధవారం ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా, దాన్ని గురువారానికి వాయిదా వేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలంతా మాజీ సీఎం విజయ్ రూపానీ ఇంటికి క్యూ కట్టారు. వీరిలో ఈశ్వర్ పటేల్,  ఈశ్వర్ పర్మార్, బచు ఖబడా, వాసన్ అహిర్, యోగేష్ పటేల్ లు వెళ్లి తమ గోడు వినిపించారు.

తమకు మంత్రి పదవులు దక్కేలేదంటూ వారంతా రూపాని  తో అన్నట్టు తెలిసింది. రూపానీ  రాజీనామా చేశాక.. బిజెపి లోని సీనియర్ లీడర్లు నితిన్ పటేల్, భూపేంద్ర సింగ్  చుద్మా, ఆర్సీ ఫాల్దు, కౌశిక్ పటేల్ ల రాజకీయం ప్రశ్నార్థకంగా మారింది. భూపేంద్ర పటేల్ సీఎం అయ్యాక.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నితిన్ పటేల్ కుర్చీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే భూపేంద్ర పటేల్,  నితిన్ పటేల్ ఇద్దరూ పటేల్ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. అందువల్ల తన పదవి ఎక్కడ ఉండబోతుందోనన్న భయం ప్రస్తుత డిప్యూటీ సీఎం ను వెంటాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: