తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దగ్గరగా చూసిన వారికి ఆయన మనస్తత్వం ఈజీగా అర్థమవుతుంది. రాజకీయల కంటే కూడా... ఆర్థిక పరమైన అంశాలపై చంద్రబాబుకు పట్టు ఎక్కువ అంటారు ఆయన సన్నిహితులు. మనీ జనరేషన్ ఎలాగో చంద్రబాబు నాయుడుకు తెలుసని... డబ్బు వచ్చే మార్గాలపై టీడీపీ అధినేతకు స్పష్టమైన అవగాహన ఉందంటారు ఆర్థిక నిపుణులు. అందుకే చంద్రబాబును ఓ విజినరీ అని కూడా అంటారు. అలాగే... ఈ రోజు హైదరాబాద్ నగరం విశ్వ నగరాల జాబితాలో చేరిందంటే అందుకు చంద్రబాబు వేసిన ఆర్థిక బాటలే కారణమంటారు కూడా. ఇదే విషయాన్ని ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు... కేటీఆర్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నారు.

అయితే చంద్రబాబు దగ్గర ఓ మైనస్ పాయింట్ కూడా ఉందంటారు ఆయన సన్నిహితులు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నేతలు... ఇతర పార్టీ నేతలను కలిసినా, వారితో చర్చలు జరిపినా, కాసేపు సరదాగా గడిపినా సరే... అలాంటి నేతలను చంద్రబాబు కాస్త దూరం పెడతారు. ఇంకా చెప్పాలంటే... ఆ నేతలే వివరణ ఇచ్చేందుకు స్వయంగా చంద్రబాబును కలిసేందుకు వచ్చినా సరే... బాబు వారిని దూరం పెడతారు. చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది సీనియర్ నేతలను చంద్రబాబు దూరం చేసుకున్నారనే అపవాదు కూడా ఉంది. తాజాగా గుడివాడలో ఓ వేడుకలో మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధా కాసేపు మాట్లాడుకున్నారు. చిరకాల మిత్రులు కావడంతో ఒకే వేదికపై కలిశారు. దీంతో రాధా వైసీపీలో చేరుతున్నారనే పుకారు మొదలైంది. దీనిపై రాధా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సరదాగా కలిస్తే ఇలా పుకార్లు పుట్టిస్తారా అని ప్రశ్నించారు. అయితే.. ఇదంతా కూడా వైసీపీ మైండ్ గేమ్‌లా ఉందని.. రాధాను చంద్రబాబుకు దూరం చేసేందుకు అధికార పార్టీ నేతలే ఈ ప్రచారం మొదలెట్టి ఉంటారని రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఏది ఏమైనా... ఈ మొత్తం ఎపిసోడ్‌పై చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: